- ప్రజలతో ముఖాముఖిలో మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలు అందజేసే ప్రతి వినతిపై బాధ్యతగా స్పందించి న్యాయం చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలు స్వీకరించారు. కొన్నింటిపై అప్పటికప్పుడు స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
మరికొన్నింటిపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో మంత్రి సీతక్కకు సుమారు 200 లకు పైగానే వినతి పత్రాలు అందాయి. అందులో ఎక్కువగా డబుల్ బెడ్ రూం ఇండ్లు, పింఛన్లు, ఉద్యోగాలు, ఉపాధి కోసం, పోలీసు నియామకాల్లో వయో పరిమితిని పెంచాలని, ధరణి లోపాలపై, అటవీ శాఖ అధికారుల తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు గిరిజనులు, ఇతర సమస్యలపై జనం మంత్రిని కలిశారు.
