ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం: మంత్రి సీతక్క

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయం: మంత్రి సీతక్క

మహబూబాబాద్: రాష్ట్రంలో గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామన్నారు మంత్రి సీతక్క.  డ్రగ్స్ కు బానిసలుగా మారడంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. 2024, జూన్ 22వ తేదీ శనివారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్పారు. రాష్ట్రంలో అన్ని  రకాల మాఫియాను సంపూర్ణంగా నిర్మూలిస్తామని తెలిపారు. భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

అసంపూర్తిగా ఉన్న మహబూబాబాద్ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. త్వరలో మరోసారి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని.. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే.. అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీతక్క హెచ్చరించారు.