వరదలతో ప్రాణనష్టం జరగకుండా చూడాలి.. మంత్రి సీతక్క ఆదేశాలు

వరదలతో ప్రాణనష్టం జరగకుండా చూడాలి.. మంత్రి సీతక్క ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: వానాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క సూచించారు. వరదల వల్ల ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ముంపు గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని  సూచించారు. మంగళవారం సెక్రటేరియెట్ లో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ తో పాటు పలువురు సీఈలు, ఎస్ఈలతో మంత్రి రివ్యూ చేపట్టారు.

  ఏటూరునాగారం మండల పరిధిలోని రాంనగర్ నుంచి మంగపేట మండలం పొదుమూరు వరకు కరకట్ట పనులను వెంటనే ప్రారంభించాలని ఇరిగేషన్ ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు. ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం ఎక్కల వరకు నిర్మించిన కట్ట మరమ్మతులు, తూముల రిపేర్లను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. గత ప్రభుత్వం కరకట్ట మరమ్మతుల కోసం కేటాయించిన  రూ.6 కోట్లతో కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వంలో ఇలాంటివాటిని ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. కరకట్ట నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.