
- కార్డులతో కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం అందిస్తాం
- తల్లిదండ్రులు లేని పిల్లలంతా ప్రభుత్వ బిడ్డలేనని వెల్లడి
- చిన్నారులకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేసిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే తొలిసారిగా అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామని మహిళా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందుకునేలా ఈ కార్డులు పనిచేస్తామని చెప్పారు. అనాథ చిన్నారుల సంరక్షణతో పాటు ఆరోగ్య భద్రత కలిగించే విధంగా ఈ కార్డులను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఇది విప్లవాత్మకమైన నిర్ణయమని పేర్కొన్నారు.
తొలి దశలో హైదరాబాద్ జిల్లాలో ఈ కార్డులు ఇచ్చామని, దశల వారీగా రాష్ట్రమంతా ఇస్తామని వెల్లడించారు. శనివారం బేగంపేట టూరిజం ప్లాజాలో శిశు విహార్‌లో ఉంటున్న 2,200 మంది అనాధ పిల్లలకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఆరోగ్య శ్రీ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేని పిల్లలంతా ప్రభుత్వ బిడ్డలేనని, పేరెంట్స్ లేరని నిరాశ చెందవద్దని, మీకు సర్కార్ అండగా ఉంటుందన్నారు.
పలు కారణాల వల్ల తల్లిదండ్రులను కోల్పోతామని, అందులో మన ప్రమేయం ఉండదన్నారు. అయినా వెనుకడుగు వేయకుండా ధైర్యంతో ముందడుగు వేయాలని సూచించారు. పాటలు, ఆటలు, చదువులో ముందుండి ఆదర్శంగా నిలవాలని, మిమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి: మంత్రి పొన్నం
అనాథ పిల్లలకు కుల ధ్రువీకరణ, ఆధార్ కార్డులు ఇప్పటికే అందజేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించడం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనాథ పిల్లలకు అండగా ఉంటూ వారిలో మనోధైర్యాన్ని నింపి, జీవిత లక్ష్యం వైపు వెళ్లేలా మహిళా సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సూచించారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్ జిల్లాలోని అనాథ, నిరాశ్రయులైన పిల్లలకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందించడంలో ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా కూలీల పిల్లలకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 2,200కి పైగా అనాథ, నిరాశ్రయులైన పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశామని వెల్లడించారు. ఈ కార్డుల ద్వారా 95కి పైగా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో 180కి పైగా వైద్య చికిత్సలు ఉచితంగా పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రులు పిల్లలతో ఫొటోలు దిగి, వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శోభన్ శ్రీలత రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ నిర్మల కాంతి వెస్లీతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.