
- మావి అమలుకాని హామీలనే ముందు.. బీఆర్ఎస్ హామీల సంగతేంది?
- మాకన్నా రూ. వెయ్యి ఎక్కువ పెంచి మేనిఫెస్టోలో ఎట్ల చెప్పిన్రు?
- రుణమాఫీతో పాటు అన్ని హామీలను తప్పకుండా అమలు చేస్తం
- ఫైళ్ల మాయంపై విచారణ జరుపుతం
- గత పదేండ్లలో ఏం జరిగిందో బయటపెడ్తమని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: అధికారం పోయిందనే బాధలో కేటీఆర్ ఉన్నారని, అదే బాధ ఆయన్ను ఇంకా వెంటాడుతున్నట్టు స్పష్టమవుతున్నదని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ‘‘వాళ్ల డొల్లతనం, లోపభూయిష్టమైన పాలన ప్రజలకు తెలుస్తున్నది కాబట్టే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నరు. హామీలన్నింటినీ అమలు చేస్తం.. తొందరపాటు వద్దు” అని చెప్పారు. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చిందన్న కేటీఆర్ కామెంట్లకు సీతక్క కౌంటర్ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు 500, వెయ్యి రూపాయలు పెంచి బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించిందని, తామిచ్చినవి అమలు కాని హామీలైతే బీఆర్ఎస్ ఇచ్చిన హామీల సంగతేందని ప్రశ్నించారు. ‘‘మేం మహిళలకు రూ.2,500 ఇస్తామంటే.. బీఆర్ఎస్ వాళ్లు రూ.3,000 ఇస్తమన్నరు. మేం పింఛన్ రూ.4 వేలంటే.. వాళ్లు ఐదు వేలన్నరు. మేం రైతులకు పెట్టుబడి సాయం రూ.15 వేలంటే.. వాళ్లు రూ.16 వేలన్నరు. మేం రూ.500కే గ్యాస్ సిలిండర్ అంటే.. వాళ్లు రూ.400కే ఇస్తమన్నరు. మేమిచ్చిన హామీలకన్నా ఓ వెయ్యి రెండువేలు ఎక్కువే చెప్పి బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మరి, మావి అమలుకాని హామీలైతే మీరెట్ల అమలు చేస్తమని చెప్పిన్రు?” అని కేటీఆర్‌ను నిలదీశారు.
అన్నింటినీ అమలు చేసి తీరుతం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే విమర్శలు చేయడం తగదని మంత్రి సీతక్క హితవుపలికారు. ఒక్క నెలైనా కాకముందే హామీలు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూపోతమని, వందరోజుల్లో అన్ని హామీలను నెరవేరుస్తామనే విషయం ఎన్నో సార్లు చెప్పామని, అదే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టామని తెలిపారు. అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు ప్రారంభించామని ఆమె గుర్తుచేశారు. మిగతా హామీలను అమలు చేసేందుకు అధికారులతో చర్చిస్తున్నామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
పదేండ్లలో ఏం జరిగిందో బయటపెడ్తం
అసలు గత పదేండ్లలో ఏం జరిగిందో బయటకు రావాలని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి సీతక్క అన్నారు. వాటిని తమ ప్రభుత్వం తప్పకుండా బయట పెడుతుందని చెప్పారు. ‘‘ఫైళ్లు ఎందుకు మాయమవుతున్నాయన్న దానిపై తప్పకుండా విచారణ చేయిస్తం. ఆ ఫైళ్లలో ఏముందో వాస్తవాలను బయటపెడ్తం. కనీసం ఫర్నీచర్నూ వదలడం లేదు. మంత్రుల ఆఫీసులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల నుంచి వాటిని ఎత్తుకెళ్లిపోవడం దుర్మార్గం. వాస్తవాలను బూడిద చేస్తామని చూసినా అన్నింటినీ ప్రజల ముందుకు తెస్తం” అని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో ప్రజలు, అధికారులు, అన్ని వర్గాలవాళ్లూ చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.
మీ సమస్యలపై త్వరలో మాట్లాడుత
గ్రామాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని సర్పంచ్ లను పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క కోరారు. బుధవారం ఆమెను సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహరెడ్డి, మహిళ అధ్యక్షురాలు ధనలక్ష్మి, సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ లతో పాటు పలువురు సర్పంచ్ లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేండ్ల టర్మ్ లో గ్రామాల్లో చేసిన డెవలప్ మెంట్ పనులను.. సర్పంచ్ ల సమస్యలను మంత్రికి వివరించారు. మంత్రితో సమావేశం అనంతరం లక్ష్మీ నర్సింహరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక సర్పంచ్ సంఘాల నేతలతో మరోసారి సమావేశం అవుతానని మంత్రి సీతక్క వెల్లడించినట్లు తెలిపారు. సర్పంచ్ ల సమస్యలు సహా అన్ని అంశాలపై చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
వచ్చే సీజన్ నుంచి రైతుభరోసా
రైతుల ఆశలు, అవసరాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు చల్లబోమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ వెంటనే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే.. తొలుత పాతపద్ధతిలోనే (రైతు బంధు) రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. ‘‘రైతు భరోసా అంటే కొత్తగా లెక్కలు తీయాల్సి వస్తుంది. అది పూర్తవ్వాలంటే లేట్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే రైతుబంధు డబ్బులను వేస్తున్నం. త్వరలోనే అన్ని లెక్కలను తీసి.. విధివిధానాలను ఖరారు చేసి వచ్చే సీజన్ నుంచే రైతు భరోసా స్కీమ్‌ను అమలు చేస్తం. రైతుల రుణమాఫీని కూడా తప్పకుండా అమలు చేస్తం. రైతులకు ఇచ్చిన హామీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు’’ అని ఆమె అన్నారు.