ఏడాదిన్నరలోనే 80 వేల కొలువులు ఇచ్చాం..నిరుద్యోగుల పదేండ్ల నిరీక్షణకు ముగింపు పలికాం: మంత్రి సీతక్క

ఏడాదిన్నరలోనే 80 వేల కొలువులు ఇచ్చాం..నిరుద్యోగుల పదేండ్ల నిరీక్షణకు ముగింపు పలికాం: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం లభించిందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పించిందని, ఏడాదిన్నర కాలంలోనే 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగామని మంత్రి సీతక్క తెలిపారు.

 శనివారం రాజేంద్రనగర్‌‌‌‌లోని తెలంగాణ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌‌‌‌మెంట్ (టీజీఐఆర్డీ) ఆడిటోరియంలో డీపీఓ,  ఎంపీడీఓల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో కలిసి  పీఆర్, ఆర్డీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజన, టీజీఐఆర్డీ సీఈఓ నిఖిలతో కలిసి డీపీఓ, ఎంపీడీఓలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. 

అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ..“ఇంతకాలం మీరు విద్యార్థులు, నేటి నుంచి ఉన్నతాధికారులు. రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ వన్ బ్యాచ్ మీది. అందుకే తెలంగాణ చరిత్రలో మీకు ప్రత్యేక స్థానం ఉంది” అని చెప్పారు. పదవులు కోల్పోయి నిరుద్యోగులుగా మారిన కొందరు రాజకీయ నాయకులు ఇప్పుడు బాకీ కార్డులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి ఫైర్​ అయ్యారు. నిరుద్యోగులను నిండా ముంచిన బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలన్నారు. 

గ్రామీణ అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర ఎంతో కీలకమని, మండలస్థాయిలో అన్నిశాఖలను సమన్వయం చేస్తూ అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత ఎంపీడీఓలదేనని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజన మాట్లాడుతూ.. ఫ్లెక్సిబుల్ మైండ్, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని కోరారు. రూల్ ఆఫ్ లా, చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ విధులు నిర్వహించాలని సూచించారు. 

అంగన్ వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీక

 అంగన్ వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీక అని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాజేంద్రనగర్‌‌‌‌ లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్ వైజర్లకు నియామక పత్రాలను మంత్రి సీతక్క స్వయంగా అందజేశారు.