మహిళల ఆర్థికాభివృద్ధితోనే దేశ ప్రగ‌తి..ఎకానమీలో మహిళల భాగస్వామ్యం పెరగాలి: సీతక్క 

మహిళల ఆర్థికాభివృద్ధితోనే దేశ ప్రగ‌తి..ఎకానమీలో మహిళల భాగస్వామ్యం పెరగాలి: సీతక్క 
  •     జీడీపీలో స్త్రీల వాటా 18 శాతమే.. అభివృద్ధి చెందిన దేశాల్లో 40 %
  •     జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సులో మంత్రి ప్రసంగం
  •     సీతక్క ప్రసంగంలో మహిళా సాధికారత ప్రతిధ్వనిస్తోంది: కేంద్ర మంత్రి పెమ్మసాని

హైదరబాద్, వెలుగు: మహిళా సాధికారతే దేశ‌ ప్రగతికి పునాది అని మంత్రి సీత‌క్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్‌లో జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సు, 25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ (సీఎల్‌సీసీ) సమావేశం జరిగింది. దీనికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖ‌ర్, మంత్రి సీతక్క విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనల ఆధారంగా మహిళల అభివృద్ధినే సమాజ అభివృద్ధిగా భావిస్తున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగాలని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను స్వయం ఉపాధి నుంచి సంప‌ద సృష్టి దిశగా తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 46.68 లక్షల మహిళలు 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారని చెప్పారు. ఎస్‌హెచ్‌జీల ఎన్‌పీఏ కేవలం 1.40 శాతమేనని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు రూ.1,121 కోట్ల వడ్డీ సబ్సిడీ మాఫీ చేసినట్టు పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద 2.05 లక్షల సూక్ష్మ వ్యాపారాలు స్థాపించడం ద్వారా రూ.3,612 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు సృష్టించామ‌న్నారు.

మహిళా సభ్యులకు రుణ బీమా, ప్రమాద బీమా వంటి పథకాలనూ అమలు చేస్తున్నామని తెలిపారు. స‌మ్మక్క -సారల‌మ్మ జాత‌ర‌ సందర్భంగా మహిళా సంఘాలు రూ.3.5 కోట్ల లాభాలు ఆర్జించారని, ఇది వారి సామర్థ్యానికి నిదర్శనమన్నారు. దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం కేవలం 18 శాతమే ఉండగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో 40 శాతానికి చేరుకుందని సీతక్క పేర్కొన్నారు. 

లఖ్‌ పతి దీదీతో మహిళలకు ఆర్థిక బలం: శివరాజ్‌ చౌహాన్‌

దేశవ్యాప్తంగా ల‌క్ ప‌తి దీదీ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరుస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇప్పటికే కోట్లాది మంది మహిళలు ఎస్‌హెచ్‌జీ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములయ్యారని, తదుపరి లక్ష్యం మరింత విస్తరణేనని చెప్పారు. బ్యాంకర్లు కేవలం రుణదాతలుగా కాకుండా భాగస్వాములుగా మారాలని సూచించారు. మ‌హిళ‌ల అభివృద్ధి విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని మంత్రి సీత‌క్క ప్రసంగించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

సీతక్క ప్రసంగంలో మహిళా సాధికారత ప్రతిధ్వనిస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీతక్క విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధ‌ర్, సెర్ప్‌ సీఈఓ దివ్యా దేవ‌రాజాన్ తదితరులు పాల్గొన్నారు.