పెంపుడు కుక్కల కోసం.. కేటీఆర్​ 12 లక్షలతో ఇల్లు కట్టించిండు: మంత్రి సీతక్క

పెంపుడు కుక్కల కోసం.. కేటీఆర్​ 12 లక్షలతో ఇల్లు కట్టించిండు: మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: ప్రగతిభవన్​లో తన పెంపుడు కుక్కల కోసం కేటీఆర్ రూ.12లక్షలతో ఇల్లు కట్టించారని మంత్రి సీతక్క విమర్శించారు. నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నా.. గూడు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా సక్కగ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్టు నిధులు ఖర్చు చేసి రాష్ట్ర ఖజనాను ఖాళీ చేశారని విమర్శించారు. ఆదివారం ములుగు మండలం గుర్తూర్ తండాలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ పార్టీ ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణను లూటీ చేశారు. ప్రగతి భవన్​లో పెంచుకునే కుక్కల కోసం కేటీఆర్ రూ.12లక్షలతో ఇల్లు కట్టించడం ఏంటి? ఇది చూశాక నాకు ఆశ్చర్యం వేసింది.

పేదలకు వంద రోజుల పని కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన స్కీమ్​ను కూడా నిర్వీర్యం చేశారు’’అని సీతక్క విమర్శించారు. భూములకు పట్టాలు లేక.. కాస్తులో ఒకరి పేరుంటే.. పట్టా మరొకరి పేరు మీద ఉన్నాయన్నారు. ధరణితో ఎంతో మంది బతుకులు ఆగమయ్యాయని విమర్శించారు. భూముల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతున్నదన్నారు. ధరణితో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చి ఆరు గ్యారంటీ పథకాల్లో రెండు ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే మరో నాలుగు హామీలు అమలు చేస్తామని తెలిపారు.