- అంగన్‌వాడీ నిర్మాణాల్లో జాప్యంపై మంత్రి సీతక్క సీరియస్
- 2,199 భవనాలకుగానూ కేవలం 500 మాత్రమే పూర్తికావడంపై అసంతృప్తి
- నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని అధికారులకు వార్నింగ్
- త్వరలోనే బ్రేక్ ఫాస్ట్ స్కీం పైలెట్ ప్రాజెక్ట్..
- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఫుల్ స్కేల్‌లో అమలుకు ప్లాన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిధులు మంజూరైనప్పటికీ పనులు పూర్తి చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ మధుర్‌నగర్‌లోని డైరెక్టర్ ఆఫీసులో అంగన్‌వాడీ భవన నిర్మాణాలపై జిల్లా సంక్షేమ అధికారులతో (డీడబ్ల్యూవో) సమీక్ష నిర్వహించారు.
2,199 అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేస్తే.. ఇప్పటివరకూ కేవలం 500 భవనాలే పూర్తయ్యాయని, ఈ తీరు సరికాదని మండిపడ్డారు. మిగిలిన భవనాలను త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటికే మొదలుపెట్టిన పనులు సకాలంలో అయిపోయేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణాల్లో ఎక్కడైనా లోపం ఉన్నా, నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించబోమని తెలిపారు.
త్వరలో అంగన్‌వాడీ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్..
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు చేయబోతున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా బ్రేక్ ఫాస్ట్ మిక్స్‌ను ఆమె స్వయంగా రుచి చూశారు. మిక్స్ ఇంకాస్త మృదువుగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. త్వరలోనే ఈ స్కీమ్‌ను పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించాలని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఇస్తున్న 100 ఎంఎల్ విజయ పాలు, ఆదివాసీ జిల్లాల్లోని బాలికలకు ఇస్తున్న పల్లి, చిరుధాన్యాల చిక్కీల పంపిణీ మంచి ఫలితాలనిస్తున్నదని మంత్రి సీతక్క చెప్పారు. వీటిని రాష్ట్రమంతటా ఇచ్చేందుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు లేనిచోట మొబైల్ అంగన్‌వాడీ సేవలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
