- అడవుల నుంచి ప్రపంచ వేదికల వరకు తన ప్రయాణం సాగిందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధని, మహిళల సాధికారతే దేశ సాధికారతని మంత్రి సీతక్క అన్నారు. అడవుల నుంచి గ్లోబల్ వేదికల వరకు తన ప్రయాణం కొనసాగిందని, సాధికారత ఎవరో ఇచ్చేది కాదని, మనమే సాధించుకోవాలని సూచించారు. ప్రపంచానికి మహిళల శక్తి చూపించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. బుధవారం నెదర్లాండ్స్‌లో మహిళా నాయకత్వ సదస్సు ‘వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్ (వీవీజీఎఫ్) గ్లోబల్ సమిట్’ జరిగింది.
ఇందులో మన రాష్ట్రం తరఫున మంత్రి సీతక్క పాల్గొన్నారు. “ప్రతికూలతల నుంచి సాధికారతవైపు – దేశాలను మారుస్తున్న మహిళల శక్తి” అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఆదివాసీ బాలిక జీవితం నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తీరు, సమాజానికి అందించిన సేవలు, ప్రజాస్వామ్య పోరాటాలు, కరోనా కాలంలో సహాయ కార్యక్రమాలను ప్రపంచ వేదికపై వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు.
పేదరికం, అసమానతలే నా బాల్యాన్ని మలిచాయి
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ..‘నేను తెలంగాణలోని చిన్న ఆదివాసీ గిరిజన గ్రామంలో పుట్టాను. పేదరికం, అసమానతలే నా బాల్యాన్ని మలిచాయి. 16 ఏండ్ల వయసులో న్యాయం కోసం అడవుల్లోకి వెళ్లి నక్సలైట్ ఉద్యమంలో చేరాను. కానీ, అసలైన మార్పు తుపాకీతో కాదు, విద్య, అనుభూతి, సాధికారతతో సాధ్యమవుతుందని తెలుసుకున్నా’ అని ఎమోషనల్ అయ్యారు. తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సాధికారత మోడల్ ప్రపంచానికి ఆదర్శమని మంత్రి తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా మహిళా సంఘాల ఆర్థిక సమృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మహిళలు క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారని, పెట్రోల్ బంకులు నడుపుతున్నారని వివరించారు. ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి అద్దెకు ఇస్తున్నారన్నారు. ఆ ఉచిత ప్రయాణికులే ఇప్పుడు ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా ఎదిగారని వెల్లడించారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
