
- మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష
హైదరాబాద్, వెలుగు: అంగన్వాడీ కేంద్రాలకు పాలు, గుడ్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, ఎక్కడైనా లోపాలు తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. సోమవారం సచివాలయంలో ఆ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ సృజన, సిబ్బంది పాల్గొన్నారు. శాఖలో జరుగుతున్న పనుల పురోగతిపై, అమలవుతున్న పథకాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
కాగా, పాల సరఫరా లోపంపై మంత్రి సీరియస్‌గా స్పందించారు. పాలు సహా ఎక్కడా ఫుడ్ గ్యాప్ లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. గుడ్ల సరఫరాలోనూ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. గుడ్ల సరఫరాలో కలర్ కోడింగ్ తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేస్తూ, ప్రతి పది రోజులకు ఒకసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో కాంట్రాక్టులను రద్దు చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం త్వరలో బ్రేక్‌ఫాస్ట్ స్కీం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
త్వరలో 1,181 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభించి.. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి లోపు పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. స్థానిక కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే నిర్మాణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించాలని సూచించారు. అలాగే, అంగన్వాడీ కేంద్రాల్లో బల్లలు, సిబ్బంది యూనిఫాంలు, చిన్నారుల యూనిఫాంలు తక్షణం సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
త్వరలో ప్రభుత్వ ఉద్యోగినులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్చంద సంస్థలతో మహిళా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ నెల 19, 20 తేదిల్లో మహిళా భద్రత పై చర్చించేందుకు రౌండ్ టెబుల్, మహిళా సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.