దొంగ ఓట్లతో గెలిచిందే BRS.. కేటీఆర్‎ను చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుంది: మంత్రి సీతక్క

 దొంగ ఓట్లతో గెలిచిందే BRS.. కేటీఆర్‎ను చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుంది: మంత్రి సీతక్క

హైదరాబాద్: జూబ్లీహిల్స్‎లో కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నిస్తుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‏ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. దొంగ ఓట్లతో గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ అని.. అలాంటిది కేటీఆర్ దొంగ ఓట్ల గురించి మాట్లాడుతుంటే.. దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసి బతుకుతుందని.. అవతలి వాళ్ల మంచిని కూడా చెడుగా చూపిస్తుందని ఫైర్ అయ్యారు. 

మంగళవారం (అక్టోబర్ 14) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగల్ రావు నగర్ డివిజన్‎లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకట స్వామి, సీతక్క, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, అభ్యర్థి నవీన్ యాదవ్, పలు కార్పొరేషన్ల చైర్మన్ల హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. బూత్ మీటింగ్‎కు వచ్చిన ప్రతి ఒక్కరు ఓటర్ లిస్ట్ చేతిలో పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించాలని సూచించారు. ఓటర్లకు ఏమైనా భిన్నాభిప్రాయలు ఉన్న తెలుసుకుని కన్విన్స్ చేయాలని చెప్పారు. నవీన్ యాదవ్ మన ఇంట్లో తమ్ముని లెక్క ఉంటడని.. ఏ పనైనా చేస్తాడన్నారు. గత పదేళ్లలో స్లమ్స్, ఊర్లలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే జూబ్లీహిల్స్‎లో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. బీసీలను, పేదలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని.. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.