
కరీంనగర్: మావోయిస్టు విప్లవోద్యమం నుంచి ఉద్యమ బంధం తెగిపోయిన.. ఆదివాసులతో ఉన్న పేగు బంధం తెగిపోలేదని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం (మే 5) ధర్మపురి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుమారు 20 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఆదివాసులకు పూర్తి స్వేచ్ఛను కల్పించాలని కోరారు. ఎలాంటి పరిస్థితులనైనా హింసతో కాకుండా శాంతియుతంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.
కర్రె గుట్టల్లో కేంద్ర సాయుధ బలగాలు మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్తో ఆదివాసులతో పాటు పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హింసను ప్రేరేపించే వాళ్లను చట్టబద్ధంగా అరెస్టు చేయొచ్చు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలిజాన్ని ఏనాడు ప్రోత్సహించలేదని.. దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతియుత వాతావరణం నెలకొల్పడం కోసం చర్చలకు పిలిచామని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వాలు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
►ALSO READ | శ్రవణ్ రావుకు బిగ్ షాక్.. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరిన సిట్
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమన్నారు. ప్రభుత్వాన్ని జోడు ఎద్దుల్లా నడిపిస్తున్నామని.. మనకు రెండు కళ్ళు ఎలానో ప్రభుత్వాన్ని అలానే కాపుడుకుంటున్నామని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఆలోచన కేంద్రం చేపట్టడం శుభ పరిణామమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.. జాబ్స్ లేక ఎంతో మంది నిరుద్యోగులు చనిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.