313 ఎకరాలు .. 15 వేల మొక్కలు

313 ఎకరాలు .. 15 వేల మొక్కలు
  • ఆయిల్ పామ్ మొక్కలు నాటడంలో రికార్డు 
  • వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లాలో ఒకే రోజు 313 ఎకరాల్లో 15వేల ఆయిల్ పామ్ మొక్కలు నాటి రికార్డు సృష్టించారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. శనివారం వనపర్తి మండలం చిట్యాలలో రైతు ముష్టి బాలీశ్వర్ 5 ఎకరాల పొలంలో సామూహిక ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి   పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.  ఆయిల్ పామ్ సాగుతో రైతుకు నికర ఆదాయం వస్తుందని,  దేశంలో బైబ్యాక్ గ్యారంటీ ఉన్న ఒకే ఒక పంట ఆయిల్ పామ్ అన్నారు. వరి మినహా అన్ని రకాల పంటలను ఆయిల్ పామ్‌‌‌‌లో అంతరపంటలుగా సాగుచేయవచ్చన్నారు.  నూనె, పప్పు గింజల సాగు వైపు రైతులను  ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.  అంతకుముందు వనపర్తి జిల్లా కేంద్రంలో చిల్డ్రన్స్‌‌‌‌ హోమ్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవన నిర్మాణానికి  మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, సీనియర్ నేత రమేశ్ గౌడ్‌‌‌‌,  జిల్లా ఆఫీసర్లు, నాయకులు 
పాల్గొన్నారు