వనపర్తి, వెలుగు: బీజేపీ నేతలు రాష్ట్రంలోని అన్ని వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 238 లబ్ధిదారులకు రూ. 67 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తుంటే... బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ మాదిరిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలని బలోపేతం చేసి ఉపాధి కల్పింస్తుంటే.. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అమ్మి ఉపాధిని దూరం చేస్తున్నదని విమర్శించారు. తాము రైతులకు రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నామని, కేంద్రం చేస్తున్నదేమిటో చెప్పాలని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్ గౌడ్, పార్టీ నాయకులు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.