రాహుల్​కు ఆదరణ వస్తున్నదనే ..బీజేపీ దాడులు: మంత్రి శ్రీధర్ బాబు

రాహుల్​కు ఆదరణ వస్తున్నదనే ..బీజేపీ దాడులు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే బీజేపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. అస్సాంలోని సోనిత్‌‌పూర్ జిల్లాలో రాహుల్‌‌ న్యాయ యాత్రపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సోమవారం హైదరాబాద్‌‌ బషీర్‌‌‌‌బాగ్‌‌లోని బాబు జగ్జీవన్‌‌రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్‌‌ లోని అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాహుల్‌‌ యాత్రపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘‘రాహుల్ యాత్రకు భద్రత కల్పించడంలో అస్సాం ప్రభుత్వం విఫలమైంది. 

రాహుల్‌‌కు, కాంగ్రెస్‌‌ పార్టీకి అస్సాం ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ‘‘బీజేపీ మాదిరిగా కాంగ్రెస్ పార్టీకి కూడా దేశవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. కానీ మా కార్యకర్తలు, అభిమానులెప్పుడూ ఇతర పార్టీ నాయకులపై దాడులు చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది” అని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ.. రాహుల్ యాత్రపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘‘అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ లో ఉన్నప్పుడే మంచి నాయకుడిగా ఉన్నారు. బీజేపీలోకి వెళ్లిన తర్వాత దారుణంగా తయారయ్యారు. ఆయనను అక్కడి జనాలు అసహ్యించుకుంటున్నారు” అని అన్నారు. ర్యాలీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షి, ఎమ్మెల్సీలు మహేశ్‌‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, నేతలు బలరాం నాయక్‌‌, అంజన్‌‌ కుమార్ యాదవ్‌‌, మధుయాష్కీ గౌడ్, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు. 

భయంతోనే దాడులు :  జగ్గారెడ్డి 

రాహుల్ యాత్రపై జరిగిన దాడిని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ జగ్గారెడ్డి ఖండించారు. దాడికి నిరసనగా సోమవారం తన ఇంట్లోనే క్యాండిల్‌‌ లైట్‌‌తో నిరసన తెలిపారు. దేశంలో ద్వేషానికి బదులు ప్రేమను పంచడం కోసం చేస్తున్న యాత్రపై దాడి చేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘రాహుల్‌‌ యాత్రపై బీజేపీ గూండాలు దాడి చేశారు. రాహుల్ చేస్తున్న యాత్రతో ప్రజల్లో మార్పు వస్తుందని భయపడి, బీజేపీ నాయకులు ఇలా దాడులు చేయిస్తున్నారు. బీజేపీ ఇలాంటి పద్ధతులు మానుకోవాలి” అని ప్రకటనలో పేర్కొన్నారు.