హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీలేని పోరాటం చేస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు. హుస్నాబాద్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కనీసం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కనీసం పేర్లు చేర్చమని చెప్పినా ఆ సర్కారు పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేస్తూ ప్రస్తుతం చెప్పినట్టే సంక్షేమ పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ఇప్పటికే కల్పించామన్నారు.
హుస్నాబాద్ ప్రాంతానికి విద్యారంగంలో భాగంగా శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావించారు. ఈ సభలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ శాసన సభ్యుడు బొమ్మ వెంకటేశ్వర్లు కలిసి 1999 నుంచి 2004 వరకు ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాన్ని ప్రజలందరి సహకారంతోనే మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
