ప్రజాదర్బార్​కు జనం క్యూ.. ఫిర్యాదులు తీసుకున్న మంత్రి శ్రీధర్ బాబు

ప్రజాదర్బార్​కు జనం క్యూ.. ఫిర్యాదులు తీసుకున్న మంత్రి శ్రీధర్ బాబు

బేగంపేట, వెలుగు : హైదరాబాద్ బేగంపేటలోని జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. సమస్యలు వివరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆయన ఫిర్యాదులు తీసుకున్నారు.

పింఛన్ కోసం వచ్చిన

నాది వరంగల్ జిల్లా. నాకు పింఛన్ రావడం లేదు. గతంలో హమాలీ పని చేసేటోణ్ని. మూడేండ్ల కింద కాలు విరిగింది. పింఛన్ ఇప్పించాలని కేసీఆర్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు అధికారుల చుట్టూ తిరిగిన. మా ఎమ్మెల్యేకి కూడా చెప్పిన. అయినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ సార్​ను కలిసి నా బాధ చెప్పుకుందామని వచ్చిన. సార్ లేరు.. అర్జీని మంత్రి సార్​కి ఇచ్చిన.

‑ రాజయ్య, వరంగల్

వాటర్, కరెంట్ కనెక్షన్ తీసేసిన్రు

హైదరాబాద్ అమీర్ పేట లోని బల్కంపేటలో మాకు ఇల్లు ఉన్నది. మాది ఉమ్మడి కుటుంబం. జీ ప్లస్ ఫ్లోర్​లో ఉంటాం. పోలియో కార ణంగా 11 ఏండ్ల నుంచి నేను నడ్వలేను. మా అన్నదమ్ముల మధ్య గొడవల కారణంగా నేనుంటున్న రూమ్​కు కరెంట్, నీళ్ల కనెక్షన్ తీసేసిన్రు. పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలే.. జీహెచ్​ఎంసీ అధికారలుకు చెప్పినా వినిపించుకోలేదు.. సీఎంకు కంప్లైంట్ చేద్దామని వచ్చిన. నా ఫిర్యాదును మంత్రికి ఇచ్చా.

‑ మదన్ లాల్, బల్కంపేట