సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే ఓడిపోయిన : శ్రీనివాస్ గౌడ్

సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే ఓడిపోయిన : శ్రీనివాస్ గౌడ్

బషీర్ బాగ్, వెలుగు: మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుమ్మక్కై తనను ఓడించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభలో సమితి అధ్యక్షుడు అంబాల నారాయణతో కలిసి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పదేండ్లు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే..10 రోజుల్లో వచ్చిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎలా గెలిచారో ప్రజలు ఆలోచించాలని కోరారు. 

భూములు కబ్జా చేశారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి తమ్ముడు పలువురు నాయకులు కుట్రలు చేసి ఓడించారని పేర్కొన్నారు. తాను కబ్జాలకు పాల్పడితే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. సర్వాయ్ పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం, నిధులు కేటాయించామని, ఆగస్టులో వచ్చే పాపన్న గౌడ్ జయంతి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వైన్స్, బార్ల కేటాయింపుల్లో గౌడ కులస్తులకు 25 శాతం కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో హామీలు పూర్తి చేయాలని డిమాండ్​ చేశారు.