అదనపు వాటా చెల్లించినోళ్లకే గొర్లు

అదనపు వాటా చెల్లించినోళ్లకే గొర్లు

హైదరాబాద్‌‌, వెలుగు: గొర్రెల యూనిట్‌‌ పై అదనపు మొత్తం చెల్లించిన 2,797 మంది లబ్ధిదారులకు ఈనెల 24 నుంచి గొర్ల యూనిట్లు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి ఆఫీసులో పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొర్రెల పంపిణీ పథకంలో పెరిగిన గొర్రెల యూనిట్ ధరకు అనుగుణంగా అదనపు వాటా రూ.12,500 చెల్లించిన వారికే గొర్లు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో రూ.31250 డీడీలు తీసిన వారంతా అదనంగా రూ.12500 చెల్లించి గొర్ల యూనిట్లను పొందాలని తెలిపారు. పెరిగిన ధరల దృష్ట్యా గొర్ల యూనిట్ ధరను రూ.1 లక్షా 25 వేల నుంచి రూ.1 లక్షా 75వేలకు పెంచామని తెలిపారు.
చేప, రొయ్య పిల్లల పంపిణీ టార్గెట్ సాధించాలి
నవంబర్ 15 నాటికి ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ 100 శాతం టార్గెట్ సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 13,043 నీటి వనరులలో 32.26 కోట్ల చేప పిల్లలను ఐదు రిజర్వాయర్ లలో 12.60 లక్షల రొయ్య పిల్లలను వేసినట్లు వివరించారు. చేపలు, రొయ్యల పంపిణీలో రూల్స్ పాటించకపోతే  ఉపేక్షించబోమని హెచ్చరించారు.