
పనికి రానోళ్లంతా డబుల్ బెడ్రూం ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నారు.. వారికి కళ్లు కనిపిస్తలేనట్లు ఉన్నాయి.. అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మే 18వ తేదీ గురువారం ఆయన జూబ్లీహిల్స్ కమలానగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. 58 జీవో ప్రకారం పేదవారి ఇల్లు రెగ్యులరైజ్ చేసినమన్న ఆయన.. రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్‌లు ఇస్తున్నామన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు కట్టి ఇస్తున్నామని, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. 126 గుడిసెలను తొలగించి 210 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించామన్నారు. గతంలో ఒక్కో ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి లక్షన్నర అయ్యేదని.. కానీ ఇప్పుడు ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించడానికి రూ. 9 లక్షలు ఖర్చు అవుతోందని చెప్పారు మంత్రి తలసాని. దేశంలో ప్రతి ఒక్కరూ నోటికచ్చిన వాగ్దానాలు చేస్తున్నరు.. కానీ పేదల కోసం ఏమీ చేయరని విమర్శించారు. అందరికీ ఇల్లు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మహిళపై తలసాని ఫైర్..
ఈ కార్యక్రమంలో భాగంగా ఓ మహిళపై మంత్రి తలసాని సీరియస్ అయ్యారు. తనకు ఇల్లు కావాలని సదరు మహిళ మంత్రి కోరింది. అయితే ఆమెకు సమాధానం చెప్పాల్సిన మంత్రి... ఆ మహిళపై మండిపడ్డారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఇలాంటి ఇల్లు కట్టారా.. అంటూ తిరిగి ఆ మహిళనే మంత్రి ప్రశ్నించారు.