గత ప్రభుత్వాలు పీవీని నిర్లక్ష్యం చేశాయి

గత ప్రభుత్వాలు పీవీని నిర్లక్ష్యం చేశాయి
  • పీవీ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం
  • పీవీ కూతురుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం
  • కాంగ్రెస్, బీజేపీ పీవీని అవమానించాయి
  • రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు భారత రత్న ఇవ్వాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పీవీ 101వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో  మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి బాట పట్టించిన అపర మేధావి పీవీ అని కొనియాడారు. పీవీ గనుక సంస్కరణలు తీసుకురాకపోతే దేశం ఆర్ధికంగా సర్వ నాశనం అయ్యేదని చాలా మంది మేధావులు చెప్పారని గుర్తు చేశారు. మారుమూల గ్రామాంలో జన్మించిన పీవీ... రాష్ట్ర మంత్రి, సీఎం, కేంద్ర మంత్రి, పీఎం స్థాయికి ఎదగడం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. దక్షిణ భారతం నుంచి ప్రధాన మంత్రి పదవిని అధిరోహించిన వ్యక్తిగా పీవీ నిలవడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. దేశానికి ఎనలేని సేవ చేసిన పీవీని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. ఆయన చనిపోతే కనీసం ఆయన పేరు మీద ఓ స్మృతి వనాన్ని కూడా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు.

కానీ స్వరాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పీవీకి సముచిత స్థానాన్ని కల్పించారని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో పీవీ ఘాట్ ఏర్పాటుతో పాటు పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. అదేవిధంగా పీవీ కూతురు వాణీ దేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సముచితంగా గౌరవించామని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పీవీకి భారత రత్న ఇవ్వాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు.