అస్సాం సీఎం దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు

అస్సాం సీఎం దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు

హైదరాబాద్ : వినాయక నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్ కు వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం ఏంటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. హిమంత బిశ్వశర్మ  వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా దిగజారుడు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదికపై తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రజలెవరూ క్షమించరని అన్నారు. గణేష్ నిమజ్జన వేదికపై రాజకీయాలు చేయడం పద్ధతి కాదన్నారు. ‘అస్సాం రాష్ట్రానికి వెళ్లి మేము కూడా మాట్లాడొచ్చు. కానీ, మాకు సంస్కారం ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా అక్కడే ఉన్న కొందరు అడ్డుకున్నారని, ఇలా మాట్లాడితే ప్రజలే తిరగబడుతారని చెప్పారు. గెస్ట్ హౌస్ లోనూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసినా, తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. 

మరోవైపు గవర్నర్ తమిళి సైపైనా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. రాష్ట్రంలో గవర్నర్ తన పరిమితులకు మించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రజలచే ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్  విమర్శించడం సరైంది కాదన్నారు. గవర్నర్ పదవికి కొన్ని పరిమితులు, బాధ్యతలు ఉంటాయనే విషయం ఆమె గుర్తుంచుకోవాలన్నారు. రాజ్యాంగానికి లోబడి మాత్రమే గవర్నర్ పని చేయాల్సి ఉందని చెప్పారు. రాజ్ భవన్ లో గవర్నర్ మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మంచి పద్దతి కాదన్నారు.