- ప్రపంచంలో పండే ప్రతి పంటకు రాష్ట్ర వాతావరణం అనుకూలం: తుమ్మల
- 19వ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలో పండే ప్రతి పంటను పండించేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. రైతులు లాభదాయకమైన పంటలు, పండ్ల చెట్లు, పూల మొక్కలతో పాటు అకడమియా, ఆర్గానెట్ వంటి ఎక్సాటిక్ జాతులను పండించాలన్నారు. గురువారం ఎన్టీఆర్ మార్గ్‌లోని ఐమాక్స్ థియేటర్ సమీపంలోని హెచ్‌ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన 19వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి తుమ్మల ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నర్సరీ మేళాలను ప్రోత్సహించాలని, పట్టణవాసులు, రైతులు ఈ నర్సరీలను ఉపయోగించుకోవాలని కోరారు. పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ సమతుల్యత కాపాడటం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింతగా విస్తరించాలన్నారు.
హార్టికల్చర్ శాఖ ఇలాంటి ఈ మేళాలను ఏటా పెద్దఎత్తున నిర్వహించాలని సూచించారు. ఈ ప్రదర్శన జనవరి 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ నర్సరీ మేళా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, మేళా ఇన్‌చార్జి ఖాలీద్ అహ్మద్, హార్టికల్చర్ అధికారులు, నర్సరీల యజమానులు పాల్గొన్నారు.
