రైతులను మోసం చేస్తే ఊరుకోం .. మంత్రి తుమ్మల వార్నింగ్

రైతులను మోసం చేస్తే ఊరుకోం .. మంత్రి తుమ్మల వార్నింగ్

ఖమ్మం టౌన్, వెలుగు: మిర్చి ధరను ఇష్టమొచ్చినట్టు తగ్గిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వ్యాపారులను హెచ్చరించారు. క్వాలిటీని బట్టి రేటు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జెండా పాటలో నిర్ణయించిన రేటుకు కాకుండా.. కాంటాల వద్ద వ్యాపారులు మిర్చి రేటు ఎందుకు తగ్గిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. మంత్రి తుమ్మల వ్యవసాయ మార్కెట్ ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి యార్డు అంతా తిరిగారు. రైతులు తెచ్చిన మిర్చి నాణ్యతను పరిశీలించారు. 

మిర్చి క్వాలిటీ పరీక్షించే అధికారి అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వాలిటీ మిర్చిని వ్యాపారులు రేటు తగ్గించి కొంటుంటే మీరేం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. అన్ని శాఖల అధికారులు కలిసి రైతులకు న్యాయం చేయాలన్నారు. ‘‘ఎన్ని ఎకరాల్లో పంట వేశారు.. ఎంత ఖర్చు వచ్చింది.. దిగుబడి ఎలా ఉంది..”అంటూ రైతులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది క్వింటాలు మిర్చికి రూ.14వేల రేటు రాగా.. ఈసారి రూ.10 వేలకు మించి రావడంలేదని, వ్యాపారులు మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వెంట మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులు లక్ష్మిబాయి, శ్రీనివాస్, విజయ నిర్మల, ఆలీం ఉన్నారు.