పంట వ్యర్థాలు కాల్చొద్దు..రైతులకు మంత్రి తుమ్మల సూచన

పంట వ్యర్థాలు కాల్చొద్దు..రైతులకు మంత్రి తుమ్మల సూచన
  • పంటల ఎంపికలో అధికారుల సలహాలు పాటించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రైతులు పంట అవశేషాలను కాల్చే విధానాన్ని పూర్తిగా మానుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. భూసారం పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించాలని తెలిపారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. పంట అవశేషాల దహనం, యూరియా సరఫరా, ఎల్‌‌నినో ప్రభావం, ఆయిల్ పామ్ సాగు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొంతమంది రైతులు పంట త్వరగా వేయాలనే ఉద్దేశంతో వరి, మొక్కజొన్న కొయ్యలు తదితర వ్యర్థాలను కాల్చుతున్నారని, దీంతో నేలలోని సేంద్రియ పదార్థం పూర్తిగా నాశనమై భూసారం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫలితంగా యూరియా, పురుగుమందులు సరిగా పనిచేయక దిగుబడులు తగ్గిపోతాయని వివరించారు. ఇకపై ఎవరైనా పంట వ్యర్థాలు కాల్చినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

యూరియా సరఫరా కేంద్ర పరిధిలోనే..

యూరియా సరఫరా విషయంలో కేంద్రం వైఖరిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతుల్లో ఆటంకాలు ఏర్పడ్డాయని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు తగిన విధంగా యూరియా సరఫరా చేసేందుకు కేంద్రం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు రావడం లేదన్నారు. యూరియా ఉత్పత్తి, సరఫరా పూర్తిగా కేంద్ర పరిధిలోనే ఉంటుందని గుర్తుచేశారు.

.ఈ ఏడాది ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిందని మంత్రి తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటలు ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, అధికారులు పాల్గొన్నారు.