ఖమ్మం పీహెచ్ సీల్లో వైద్య సిబ్బందిని పెంచాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం  పీహెచ్  సీల్లో వైద్య సిబ్బందిని పెంచాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బందిని పెంచి.. ప్రతిరోజూ12 గంటలపాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యం కోసం పట్టణ పీహెచ్​సీల ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం స్థానిక 36వ డివిజన్ లో రూ.63 లక్షలతో రజక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ.2.43 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రజలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రశాంత, పచ్చని, ప్రగతిశీల నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. కోట్ల రూపాయలున్నా రహదారులు ఇరుకుగా ఉంటే ఉపయోగం లేదన్నారు. జనాభాకు తగ్గట్టు రహదారుల విస్తరణ చేస్తే వ్యాపారం బాగా జరుగుతుందన్నారు. 

రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయినవారికి న్యాయం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ రామారావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.