
హైదరాబాద్, వెలుగు: అక్టోబర్ నుంచే పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సీసీఐ సమర్థవంతంగా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. శుక్రవారం 2025- – 26 పత్తి మార్కెటింగ్ సీజన్‌కు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై సీసీఐ, అగ్రికల్చర్మార్కెటింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో పండే పత్తికి ప్రత్యేక నాణ్యత ఉందని.. ప్రస్తుతం బహిరంగా మార్కెట్లో ఎంఎస్పీ కంటే క్వింటాల్‌కు రూ.1,099 తక్కువగా ఉండడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను 110 నుంచి 122కి పెంచినట్టు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా కొనరావుపేట ఏఎంసీ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీఐ ప్రవేశపెట్టిన “కపాస్ కిసాన్” యాప్ ద్వారా రైతులు స్వయంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, ఏఈవోల ద్వారా రైతులకు ఈ యాప్‌పై అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.
కౌలు రైతులు ఓటీపీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. కాగా, కొనుగోలు కేంద్రాల్లో స్థానిక మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇవి తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా పర్యవేక్షిస్తాయని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5779, వాట్సాప్ హెల్ప్‌లైన్ 88972 81111 ఏర్పాటు చేసినట్టు తెలిపారు.