తెలంగాణకు 35 వేల టన్నుల యూరియా:మంత్రి తుమ్మల

తెలంగాణకు 35 వేల టన్నుల యూరియా:మంత్రి తుమ్మల
  • డిమాండ్​కు తగ్గట్టు జిల్లాలకు పంపిస్తున్నం: మంత్రి తుమ్మల
  • రైతులెవరూ ఆందోళన చెందొద్దు
  • యూరియా కొరతకు కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణం
  • తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాలపై నిందలు
  • బీఆర్ఎస్​వి దిగజారుడు రాజకీయాలని మండిపాటు.. రైతులకు బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాల్లో యూరియా  కొరతకు కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణమని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు మండిపడ్డారు. స్థానికంగా ఉత్పత్తి పెంచకుండా, ఇతర దేశాల నుంచి  సకాలంలో తెప్పించకుండా కేంద్రం చోద్యంచూడడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ‘‘ఇతర దేశాల నుంచి యూరియాను తెప్పించి, రాష్ట్రాలకు సరఫరా చేయడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విఫలమైంది. 

తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాలపై నిందలు వేస్తోంది. వాటిని రైతులు నమ్మవద్దు..’’ అని సూచించారు.  అటు బీఆర్​ఎస్​ సైతం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఫైర్​అయ్యారు. తాము కేంద్రంపై చేసిన ఒత్తిడితో ఈ వారం రోజుల్లో రాష్ట్రానికి 35 వేల  టన్నుల యూరియా - వచ్చిందని, వచ్చిన యూరియాను  డిమాండుకు  అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్​ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.  

అందువల్ల రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. రామగుండం నుంచి రావాల్సిన యూరియాను తెప్పించడానికి ఇప్పటికే ఆర్ఎఫ్ సీఎల్ ఎండీతో మాట్లాడామని, త్వరలో అది కూడా వస్తుందన్నారు. ఇప్పటివరకు పాత నిల్వలతో కలుపుకొని ఈ వానాకాలం సీజన్​లో 7.32 లక్షల టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు మంత్రి వివరించారు. ఈ మేరకు సోమవారం రైతులకు మంత్రి తుమ్మల బహిరంగ లేఖ రాశారు.

 కేంద్రం అసమర్థత వల్లే కొరత..

యూరియా కొరతకు కేంద్రం అసమర్థతే కారణమని  రైతులకు రాసిన బహిరంగ లేఖలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రష్యా, -ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్,-ఇరాన్ ఘర్షణలతో ఎర్ర సముద్రంలో నౌకాయానం నిలిచిపోయిందని, దీంతో విదేశాల నుంచి రావాల్సిన యూరియా ఆలస్యమవుతోందన్నారు. ఈ విషయం కేంద్రానికి ముందే తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదన్నారు. 

వానాకాలం సీజన్‌‌లో తెలంగాణకు కేంద్రం 9.80 లక్షల టన్నులు కేటాయించిందని,  ఇందులో ఆగస్టు వరకు 8.30 లక్షల టన్నులు రావాల్సి ఉండగా,  కేవలం 5.72 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసిందని పేర్కొన్నారు. ఇక సీఐఎల్, ఐపీఎల్​, క్రిబ్​కో, ఎన్​ఎఫ్​ఎల్​ కంపెనీల ద్వారా 3.96 లక్షల టన్నులు యూరియా కేటాయించగా, 2.10 లక్షల టన్నులు మాత్రమే వచ్చాయని, మిగతా 1.86 లక్షల టన్నులు ఆలస్యమైందన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా ప్రతిపక్షాలు మాత్రం స్వార్థ రాజకీయాల కోసం రైతుల ముసుగులో ప్రేరేపిత ఆందోళనలు చేయిస్తున్నాయని మండిపడ్డారు. 

డిమాండ్​కు తగినట్లుగా మన ఉత్పత్తి లేదు..

దేశంలో డిమాండ్​కు సరిపడా ఉత్పత్తి లేదని మంత్రి తుమ్మల వివరించారు. ఉదాహరణకు రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ (ఆర్​ఎఫ్​సీఎల్​) నుంచి రాష్ట్రానికి1.69 లక్షల టన్నులు కేటాయించగా,  ఇప్పటివరకు1.07 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయిందని మంత్రి వివరించారు. 78 రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడంతో 62,473 టన్నుల లోటు ఏర్పడిందన్నారు. ‘‘కేంద్రం రామగుండం ఆర్​ఎఫ్​సీఎల్  నుంచి మన రాష్ట్రానికి  కేవలం 40 శాతం మాత్రమే యూరియా కేటాయించింది. 

మిగిలిన 60శాతం వేరే రాష్ట్రాలకు తరలిస్తోంది. దేశీయ ఉత్పత్తి లేకపోవడంతో అన్ని రాష్ట్రాల్లోనూ యూరియా కొరత ఉంది. కానీ మన రాష్ట్రంలో మాత్రమే ఉన్నట్లుగా అదే బీజేపీ, బీఆర్ఎస్​ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి’’ అని  మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ యూరియా కొరత ఉందని, అక్కడ కూడా రైతులు ఆందోళన చేస్తున్నారని  మంత్రి వివరించారు.  

ఇక్కడి బీజేపీ నాయకులు ఆ విషయాలను దాచి, యూరియా కొరతకు కాంగ్రెస్​ సర్కారే కారణమన్నట్లుగా చెప్తున్నారని, ఇది ఎంతవరకు కరెక్టో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అధికారం కోల్పోయిన ప్రస్టేషన్​లో ఉన్న  బీఆర్‌‌ఎస్ నేతలు రైతుల ముసుగులో ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘క్యూలైన్లలో చెప్పులు పెట్టి ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తూ రైతులను రెచ్చగొడ్తున్నరు. 

కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మా పాలనలో యూరియా కొరత లేదని గొప్పలు చెప్పే బీఆర్‌‌ఎస్‌‌కు తాజాగా తలెత్తిన అంతర్జాతీయ యుద్ధాల ప్రభావం తెలియదా? ’‘ అని నిలదీశారు. 

కాంప్లెక్స్​ ఎరువుల ధరలు తగ్గించాలి

యూరియా కొరతపై కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులకు ఇప్పటికి ఏడుసార్లు లేఖలు రాశామని,  సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రులను కలిసి చర్చించారని మంత్రి తుమ్మల గుర్తుచేశారు.  పార్లమెంట్‌‌లో ఎంపీలు నిరసనలు చేసి 50 వేల టన్నులు తెప్పించారని, ఇందులో 35 వేల టన్నులు ఇప్పటికే వచ్చాయన్నారు.  ప్రస్తుతం తలెత్తిన సమస్య మళ్లీ రావద్దంటే కేంద్రం దేశీయ ఉత్పత్తి పెంచడంతోపాటు, నానో యూరియా వాడకాన్ని  ప్రోత్సహించాలని సూచించారు. 

అలాగే కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.‘‘రైతన్నలూ.. ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందవద్దు. ప్రతిపక్షాలు వాస్తవాలు దాచి మిమ్మల్ని రెచ్చగొడ్తున్నందున వాళ్ల వలలో పడవద్దు.   మీకు మా కాంగ్రెస్​ ప్రభుత్వం అండగా ఉంటుంది. మనకు రావాల్సిన యూరియా కోసం ఎంతవరకైనా పోరాడుతాం’’ అని లేఖలో  స్పష్టంచేశారు.