
- మహిళల చిరునవ్వులతోనే ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయి..
- అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మహిళలు చిరునవ్వులు చిందిస్తేనే ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో 200కోట్ల ఉచిత ప్రయాణాల సందర్భంగా కొత్తగూడెం బస్టాండ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పలువురు మహిళా ప్రయాణికులకు బహుమతులు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరుమీదనే ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజున ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై రేవంత్ రెడ్డి సంతకం చేశారని గుర్తుచేశారు.
మహిళలకు ప్రయాణ చార్జీల రూపంలో రూ. 6,680కోట్లు ఆదా అయిందన్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు, రాజమండ్రి, నాగపూర్ ప్రాంతాలకు హైవేల నిర్మాణాలు జరుగనున్నాయన్నారు. కిరండోల్ వరకు రైల్వే నిర్మాణం భద్రాచలం మీదుగా సాగేలా కృషి చేస్తున్నామన్నారు. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రైల్వే నిర్మాణం పూర్తి అయిందని, అక్కడి నుంచి కొవ్వూరుకు రైల్వే లైన్ కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. కొత్తగూడెం త్వరలో ఎయిర్ పోర్టు రానున్నదన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచల్లో కొత్త బస్టాండ్లను నిర్మించాలని మంత్రిని కోరారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మహాలక్ష్మి స్కీం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లాభాలకు తీసుకువస్తోందని తెలిపారు. అనంతరం ఇల్లెందు క్రాస్ రోడ్డులో నిర్మిస్తున్న టూరిజం హోటల్‌ను మంత్రి సందర్శించారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీతో పాటు టూరిజం హోటల్‌ను సీఎం ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. ‘మీ ఎండీ ఎవరు’ అని అడిగితే టూరిజం శాఖ డీఈ నీళ్లు నమలడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హోటల్ చుట్టూ అందమైన మొక్కలు నాటాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో ఎస్పీ బి.రోహిత్ రాజు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, ఆర్టీసీ డిపో మేనేజర్ దేవెందర్ గౌడ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
సత్తుపల్లి క్లీన్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండాలి
సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణం క్లీన్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ నరసింహారావుకు సూచించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా గండుగులపల్లిలోని ఆయన స్వగృహంలో తుమ్మలను కలిసిన కమిషనర్ కు సత్తుపల్లి పట్టణం అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీలు, రోడ్డును శుభ్రంగా ఉంచాలని, డివైడర్ ల్లో అందమైన మొక్కలు ఉండేట్లు చూడాలని సూచించారు.
మధిర డిపోలో మహాలక్ష్మి పధకం సంబరాలు
మధిర : మధిర ఆర్టీసీ బస్ డిపో లో బుధవారం మహాలక్ష్మి పధకం సంబరాలు ఘనంగా నిర్వహించారు. బస్సుల్లో ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, విద్యార్థులను అధికారులు సత్కరించి వారికి బహుమతులు అందచేశారు. ఈ పథకంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్, మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్, డిపో మేనేజర్ శంకర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులో మంత్రి ప్రయాణం
ఖమ్మం, వెలుగు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఖమ్మం బస్టాండ్ లో జరిగిన మహాలక్ష్మి సంబరాలకు మంత్రి హాజరయ్యారు. రాష్ట్రంలో మహిళల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఎన్ని కష్టాలు ఎదురైనా మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తోందని తుమ్మల తెలిపారు.
తర్వాత ఖమ్మం బస్టాండ్ నుంచి మూలగూడెం వరకు ఆర్టీసీ బస్సులో మంత్రి ప్రయాణించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు మూలగూడెం బస్ సర్వీస్ ను ఏర్పాటు చేసినట్టు ఆయన గుర్తుచేశారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఖమ్మం మేయర్ నీరజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.