సమ్మక్క సాగర్కు ఎన్వోసీ ఇవ్వండి.. చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్కు మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి

సమ్మక్క సాగర్కు ఎన్వోసీ ఇవ్వండి.. చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్కు మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి
  • ఎన్వోసీ ఇస్తేనే సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్​కు ఆమోదం వస్తుందని వెల్లడి
  • సర్వే కోసం నిధులు విడుదల చేశాం.. పరిహారం అడ్వాన్స్​గా ఇస్తామని హామీ
  • బ్యారేజీని తుపాకులగూడెం వద్ద నిర్మించడం వల్ల చత్తీస్​గఢ్​లో ముంపు తగ్గిందని వివరణ
  • హైదరాబాద్​కు వచ్చిన విష్ణుదేవ్​ సాయ్​.. 
  • పార్క్​ హయత్​లో మంత్రి భేటీ
  • ఐఐటీ ఖరగ్​పూర్ ​అధ్యయన నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్న విష్ణుదేవ్​ సాయ్​

హైదరాబాద్, వెలుగు:
సమ్మక్క సాగర్ ​ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇవ్వాలని చత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్​ సాయ్​ని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కోరారు. ఎన్వోసీ ఇస్తేనే సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్​కు ఆమోదం వస్తుందని, కొన్ని అనుమతులు దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉండడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. 

సర్వే కోసం నిధులు విడుదల చేశామని, పరిహారం కూడా అడ్వాన్స్​గా ఇస్తామని హామీ ఇచ్చారు. గోదావరి పరివాహకంలో సాగు, తాగు నీటి అవసరాల రీత్యా సహకరించాలని చత్తీస్​గఢ్​ సీఎంకు మంత్రి ఉత్తమ్​ విజ్ఞప్తిచేశారు. కాగా, ఎన్వోసీ ఇచ్చేందుకు చత్తీస్​గఢ్​ సీఎం సానుకూలత వ్యక్తంచేసినట్టు భేటీ అనంతరం మీడియాతో ఉత్తమ్​ చెప్పారు.  

  • చత్తీస్​గఢ్​కు జరిగే నష్టాన్ని పూర్తిగా భరిస్తామని హామీ..

గురువారం రాత్రి విష్ణుదేవ్​ సాయ్​ హైదరాబాద్​కు వచ్చారు. పార్క్​ హయత్​లో ఉన్న ఆయనతో శుక్రవారం మంత్రి ఉత్తమ్​ భేటీ అయ్యారు. 


ఈ సందర్భంగా సమ్మక్కసాగర్​ బ్యారేజీ ఎన్వోసీపై ఆయనతో చర్చించారు. ఎన్వోసీ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. నిరుడు సెప్టెంబర్​ 22న చత్తీస్​గఢ్​లో జరిగిన మీటింగ్​లో మంత్రి ఉత్తమ్​ కోరిన అంశాన్ని మరోసారి గుర్తు చేశారు. సీడబ్ల్యూసీలోని ఇంటర్​ స్టేట్​ డైరెక్టరేట్​ మినహా అన్ని విభాగాల నుంచి ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయన్నారు. చత్తీస్​గఢ్​కు జరిగే నష్టాన్ని పూర్తిగా భరిస్తామని హామీ ఇచ్చారు. ముంపు ప్రభావం తెలుసుకునేందుకు ఇప్పటికే రెండు రాష్ట్రాల ఇంజనీర్లు జాయింట్​ సర్వే చేశారన్నారు.  

చత్తీస్​గఢ్​ ఆందోళనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. సర్వేకు అయ్యే ఖర్చును భరిస్తామని, దానికి సంబంధించి ఇప్పటికే రూ.9.88 కోట్లు చత్తీస్​గఢ్​ వాటర్​ రీసోర్సెస్​ డిపార్ట్​మెంట్​కు గత నెలలోనే విడుదల చేశామని పేర్కొన్నారు. ముంపు పరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చత్తీస్​గఢ్​ సీఎంకు అందజేసిన లేఖలో పేర్కొన్నారు.

  • 4.40 లక్షల ఎకరాలకు నీళ్లు..

సాంకేతిక అధ్యయనాల తర్వాత బ్యారేజీని ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద నిర్మించడంవల్ల సాంకేతికంగా, ఆర్థికంగా మరింత ప్రయోజనకరమని తేలిందని, ఈ మార్పుతో చత్తీస్‌‌గఢ్ లో ముంపు ప్రభావం గణనీయంగా తగ్గిందని మంత్రి ఉత్తమ్​ వివరించారు. సమ్మక్క–సారక్క బ్యారేజ్ ద్వారా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించి ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. 

అదనంగా రామప్ప–పాకాల లింక్ కాలువ ద్వారా మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద కూడా కొంత ఆయకట్టును స్థిరీకరిస్తామన్నారు.  ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రాజెక్టు డీపీఆర్‌‌ను 2021 ఆగస్టు 31న సీడబ్ల్యూసీకి సమర్పించినట్టు మంత్రి తెలిపారు. హైడ్రాలజీ డైరెక్టరేట్, కాస్ట్ ఎస్టిమేట్స్ డైరెక్టరేట్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర భూగర్భ జల మండలి సహా పలు ప్రధాన అనుమతులు ఇప్పటికే లభించాయని చెప్పారు. 2024 జులై నుంచి 2026 జనవరి వరకు కేంద్ర జల సంఘం కోరిన వివరణలన్నింటికీ సమగ్ర సమాధానాలు ఇచ్చామన్నారు.  

  • ఎన్వోసీ కోసం కృషి

ఎన్వోసీ కోసం రెండేండ్లుగా కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్​ చెప్పారు. 2024 ఏప్రిల్ 26, ఆగస్టు 12, 2025 జనవరి 24, ఏప్రిల్ 23 తేదీల్లో చత్తీస్‌‌గఢ్ ప్రభుత్వానికి లేఖలు రాశామన్నారు. 2025 సెప్టెంబర్ 22న రాయ్‌‌పూర్‌‌లో చత్తీస్‌‌గఢ్ సీఎంని స్వయంగా కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు గుర్తు చేశారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి  సీఆర్​పాటిల్, సీడబ్ల్యూసీ చైర్మన్​తో కూడా ఈ అంశంపై చర్చలు జరిపినట్టు మంత్రి తెలిపారు. 

2025 నవంబర్, డిసెంబర్​లలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రత్యేక విజ్ఞప్తులు పంపి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరామన్నారు. చత్తీస్‌‌గఢ్ ప్రభుత్వం ఎన్వోసీ జారీ చేసిన వెంటనే కేంద్ర జల సంఘం అంతర్‌‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్.. డీపీఆర్​ను క్లియర్​ చేస్తుందన్నారు. దీంతో సమ్మక్క సాగర్​బ్యారేజ్ అమలుకు ఉన్న చివరి అడ్డంకి కూడా తొలగిపోయే అవకాశం ఉందని ఉత్తమ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం సమ్మక్కసాగర్​ ముంపుపై ఐఐటీ ఖరగ్​పూర్​ స్టడీ చేస్తున్నదని, ఆ నివేదిక వచ్చిన తర్వాత ఎన్వోసీపై నిర్ణయం తీసుకుంటామని మీడియా చిట్​చాట్​లో చత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్​ సాయ్​ పేర్కొన్నారు. 

బ్యారేజీ కింద ఆయకట్టు వివరాలు..
జిల్లా             ఎకరాలు
సూర్యాపేట    2,34,199
మహబూబాబాద్​    96,494
ఖమ్మం    85,774
వరంగల్​    22,422
నర్సంపేట    22,000
ములుగు    8,000
జనగామ    1,111