వడ్లు కొనాలని కేంద్రంపై ఒత్తిడి తెండి.. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ నేతలకు మంత్రి ఉత్తమ్ సవాల్

వడ్లు కొనాలని కేంద్రంపై ఒత్తిడి తెండి.. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ నేతలకు మంత్రి ఉత్తమ్ సవాల్
  • వడ్ల కొనుగోళ్లపై బీజేపీ నేతలు నీచరాజకీయం చేస్తున్నారని ఫైర్ ​
  • వడ్ల ఉత్పత్తి పెరిగినా.. ఎఫ్​సీఐ బియ్యం సేకరణ తగ్గిస్తోందని విమర్శ 
  • రాజకీయాల కోసమే తప్పుడు విమర్శలు: తుమ్మల
  • పెట్రోల్, డీజిల్ ధరల నుంచి దృష్టి మళ్లించడానికే: పొన్నం

హైదరాబాద్, వెలుగు: బీజేపీ లీడర్లు ఇక్కడ ధర్నాలు చేయడం కాదని.. ఢిల్లీ వెళ్లి వడ్లను కొనాలని కేంద్రం మీద ఒత్తిడి తేవాలని సివిల్​ సప్లయిస్​ మినిస్టర్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి సవాల్​చేశారు. వడ్ల కొనుగోళ్లపై బీజేపీ నీచరాజకీయం చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం సెక్రటేరియట్​లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రతి సీజన్‌‌కు వరి ఉత్పత్తి పెరుగుతోందని.. కానీ, కేంద్రం ఎఫ్‌‌సీఐ ద్వారా బియ్యం సేకరణ లక్ష్యాలను తగ్గిస్తోందని ఉత్తమ్ వివరించారు. 

కోటా పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి, తాను చాలాసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ధాన్యం దిగుబడిలో, కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, దేశవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ వాటా 60 శాతం ఉందని, సీజన్ ముగిసే నాటికి 75 శాతానికి చేరుకుంటుందని వివరించారు. యాసంగిలో పండిన ధాన్యంలో చివరి గింజ వరకు కొంటామని ఉత్తమ్​ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 8,575 సెంటర్ల ద్వారా 60 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని.. ధాన్యం కొన్నాక 48గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని.. ఇప్పటికే రూ.11,050 కోట్లు చెల్లించామని తెలిపారు. 

అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పిందన్నారు. కేంద్రం 52 లక్షల టన్నులే సేకరించాలని నిర్ణయించినప్పటికీ.. ఇప్పటికే ఆ లక్ష్యానికి మించి 60 లక్షల మెట్రిక్​ టన్నులు కొనుగోలు చేసిందన్నారు. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు.  

  • రాజకీయాల కోసమే తప్పడు విమర్శలు: తుమ్మల

రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. అధికారం కోసం కలలు కంటున్న బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నారని తుమ్మల ఫైర్​అయ్యారు. డీజిల్​ కొరతతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడవక కోతలు జరక్క వారం పది రోజులు రైతులు గోస పడ్డారని, డీజిల్ సప్లయ్ తగ్గడానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. 

  • పెట్రోల్, డీజిల్ ధరల మీద నుంచి దృష్టి మళ్లించడానికే: పొన్నం

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే బీజేపీ లీడర్లు యాత్రలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆందోళనలకు రైతులు ఎవరూ రావడం లేదని ఇటీవల బీఆర్​ఎస్​ నేత మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ కు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని, యూరియా అందక రైతులు ఇబ్బంది పడితే కేంద్రమే బాధ్యత వహించాలని అన్నారు.