
- రాయపూర్‌లో ఆ రాష్ట్ర సీఎంతో ఇరిగేషన్ మంత్రి భేటీ
- ఎన్వోసీ జారీకి విష్ణుదేవ్ సూత్రప్రాయ అంగీకారం
- ముంపు బాధితులకు పరిహారం చెల్లిస్తామని ఉత్తమ్ హామీ
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ వివరాల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గోదావరి నదిపై నిర్మిస్తున్న సమ్మక్కసాగర్ ప్రాజెక్టుతో చత్తీస్‌గఢ్‌లో మునిగిపోయే భూములకు పరిహారం చెల్లిస్తామని.. నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేయాలని ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి చత్తీస్గఢ్ సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ అధికారులతో కలిసి రాయపూర్‌లో చత్తీస్‌గఢ్ సీఎంతో సమావేశమయ్యాయరు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. సానుకూలంగా స్పందించిన చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి ధన్యవాదాలు తెలిపారు.
చత్తీస్‌గఢ్ లో భూసేకరణ, పరిహారం, పునరావాస బాధ్యతను పూర్తిగా తెలంగాణ తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నల్గొండ, వరంగల్ జిల్లాలకే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సాగునీటి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుందని మంత్రి స్పష్టంచేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఎన్వోసీ లేకుండా ప్రాజెక్టు ముందుకు పోలేదని, ఇందుకు ఆ రాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో దీనిపై అనుకూల నిర్ణయం వెలువడుతుందని మంత్రి ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంద్రావతి-గోదావరి సంగమం వద్ద..
సమ్మక్కసాగర్ బ్యారేజ్ ములుగు జిల్లాలోని తుపాకుల గూడెం వద్ద నిర్మాణంలో ఉందని చత్తీస్‌గఢ్ సీఎంకు మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 83 మీటర్ల పూర్తి రిజర్వాయర్ లెవల్ వద్ద 6.7 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు, ఇంద్రావతి సంగమం దిగువన గోదావరి నదిపై ఉందని వివరించారు. ప్రాజెక్టు ప్లానింగ్ ప్రకారం.. సమ్మక్కసాగర్ ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–II కింద 1.78 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరిస్తుందని, రామప్ప–పాకాల లింక్ కెనాల్ కింద 12,146 హెక్టార్ల కొత్త ఆయకట్టును సృష్టిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ అదనపు సాగునీటి సామర్థ్యం వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు.
ఖరగ్‌పూర్ ఐఐటీలో ముంపుపై స్టడీ
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలో తాగు, సాగు నీటి సమస్యలు తీరినా, ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని భూపాలపట్నం తహసీల్ లో సుమారు 13.06 హెక్టార్ల భూమి, 54.03 హెక్టార్ల నది ప్రాంతం, 6.35 హెక్టార్ల నాలా భూమి ముంపునకు గురవుతోందని ఉత్తమ్ వివరించారు. భూసేకరణ, పునరావాసం ఖర్చులు భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్ సర్కారు ఐఐటీ ఖరగ్‌పూర్ తో ముంపుపై స్టడీ చేయిస్తున్నదని, దాని ప్రకారం పునరావాసం కోసం ముందస్తు పరిహారం చెల్లిస్తామన్నారు. అందువల్ల సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్వోసీ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.