- ఎల్‌నినో నేపథ్యంలో ఐఎండీ సూచనలు పాటించాలి
- నీటి లభ్యతకు అనుగుణంగా జిల్లాలవారీగా సాగు కార్యాచరణ
- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సెక్రటేరియట్లో ఎల్‌నినో, వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయ కార్యాచరణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల, అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలవారీగా కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కావద్దని మంత్రి సూచించారు.
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) జారీ చేసే వర్షపాతం అంచనాలు, హెచ్చరికలను రైతులు పరిగణనలోకి తీసుకుని సాగు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వదంతులను నమ్మకుండా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాస్త్రవేత్తల మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. ఎల్‌నినో సవాళ్లను శాస్త్రీయ ప్రణాళికతో ఎదుర్కొని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తుందని తెలిపారు.
తాజా వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాల వారీగా వర్షపాతం, భూగర్భజలాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సాగునీటి లభ్యతను నిరంతరం సమీక్షించి, వాటికి అనుగుణంగానే పంటల ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అధిక నీటితో సాగయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించాలన్నారు. గ్రామసభలు, రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి శాస్త్రీయ సమాచారాన్ని వేగంగా రైతులకు చేరవేయాలని చెప్పారు. ఏ ప్రాంతంలో ఏ పంట అనుకూలమనే విషయంపై రైతులకు సలహాలు అందించాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో ఉన్న వాస్తవ నీటి నిల్వలపై రైతులకు పూర్తి సమాచారం అందించి, నీటి లభ్యతకు అనుగుణంగానే సాగు ప్రణాళికలు రూపొందించుకునేలా చూడాలన్నారు.
విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలి
మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమైన వెంటనే శ్రీపాద ఎల్లంపల్లితో పాటు గోదావరి బేసిన్‌లోని ప్రధాన జలాశయాలను నింపేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
