
- సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం ప్రారంభిస్తరు: ఉత్తమ్
- 13 లోపు అప్లికేషన్ల పరిశీలన పూర్తి
- ఈ నెలలోనే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు పునఃప్రారంభిస్తామని వెల్లడి
నల్గొండ, వెలుగు: ఈ నెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభిస్తారని తెలిపారు. బుధవారం నల్గొండలో జరిగిన రివ్యూ మీటింగ్‌కు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఉత్తమ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్.. రేషన్ కార్డుల పంపిణీలో నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కేవలం ఉప ఎన్నికల టైంలోనే కార్డులను మంజూరు చేసిందని ఫైర్ అయ్యారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్ల పరిశీలనను ఈ నెల 13లోగా పూర్తి చేసి, అర్హులైన వారిని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 2.89 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 99 శాతం మంది ప్రజలు ఈ బియ్యన్ని తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రాజెక్టులు పూర్తి చేస్తం..
అత్యాధునిక టెక్నాలజీ సహకారంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను ఈ నెలలోనే పునఃప్రారంభిస్తామని ఉత్తమ్ తెలిపారు. ‘‘టన్నెల్ పూర్తి చేయడం కోసం భారత సైన్యానికి చెందిన జనరల్ ఆర్పల్ సింగ్‌ను డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి, హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రో మాగ్నటిక్ రాడార్ సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. టన్నెలింగ్‌లోనే బెస్ట్ పాలసీ ద్వారా పనులను పూర్తి చేస్తాం. అదేవిధంగా సాగు నీటి రంగానికి సలహాదారుడిగా భారత సైన్యానికి చెందిన పరీక్షిత్ మెహ్రాను నియమిస్తున్నాం. రూ.1,800 కోట్లతో చేపట్టబోయే డిండి ప్రాజెక్ట్ పనుల టెండర్లను త్వరలోనే పూర్తి చేస్తాం. రూ.400 కోట్లతో హెచ్‌ఎల్‌సీ లైనింగ్, మొజిలైజేషన్ పనులను ప్రారంభిస్తాం. నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ పనులను సకాలంలో పూర్తి చేస్తాం” అని చెప్పారు. వీటికి సంబంధించిన భూసేకరణ, అటవీ శాఖ సమస్యలపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు.