బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అతి తెలివితోనే రాష్ట్రానికి తీరని నష్టం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అతి తెలివితోనే  రాష్ట్రానికి తీరని నష్టం :  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • పోలవరం–-నల్లమల సాగర్‌‌‌‌ను అన్ని ఫోరమ్‌‌‌‌లలోనూ వ్యతిరేకిస్తున్నం: మంత్రి ఉత్తమ్‌‌‌‌
  • ఏపీ నీటి అక్రమ మళ్లింపును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించినం
  • రిట్ పిటిషన్ కాదు.. సూట్ పిటిషన్‌‌‌‌కు రమ్మని కోర్టు సూచించింది
  • వచ్చే సోమవారం విచారణకు నేనే స్వయంగా వెళ్తానని వ్యాఖ్య 

హైదరాబాద్​, వెలుగు: గత పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్ పాలనలో కృష్ణా, గోదావరి జలాల విషయంలో ‘తెలివి ఎక్కువ.. పని తక్కువ’ అన్నట్లుగా వ్యవహరించి తెలంగాణకు తీరని నష్టం చేశారని ఇరిగేషన్‌‌‌‌ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌‌‌‌ఎస్ నేతల అతి తెలివితేటల వల్లే ప్రాజెక్టుల ప్లేస్‌‌‌‌లు, డిజైన్లు మారి రాష్ట్రం నష్టపోయిందని అన్నారు. సోమవారం  అసెంబ్లీ లాబీల్లో మంత్రి ఉత్తమ్‌‌‌‌ మీడియాతో చిట్‌‌‌‌చాట్ చేశారు.  

ఈ సందర్భంగా పోలవరం-–నల్లమల సాగర్ ప్రాజెక్టు, సుప్రీంకోర్టులో కేసు వివరాలు, బీఆర్‌‌‌‌ఎస్ నేత హరీశ్‌‌‌‌రావు ఆరోపణలపై మాట్లాడారు.  పోలవరం–-నల్లమల సాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఫోరమ్‌‌‌‌లలోనూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. ‘‘ఇది ఇంటర్ స్టేట్ రూల్స్‌‌‌‌కు విరుద్ధమని ఇప్పటికే మేం గోదావరి రివర్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు (జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ)కి లేఖ రాశాం. మా వాదనతో జీఆర్ఎంబీ కూడా ఏకీభవించింది. 

కేవలం తెలంగాణ మాత్రమే కాదు.. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి” అని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌‌‌‌ రావు మీడియా ముందు చూపిస్తున్న లేఖకు, ప్రస్తుతం జరుగుతున్న విషయానికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. అది ఇంటర్నల్‌‌‌‌గా జరిపిన కమ్యూనికేషన్‌‌‌‌కు సంబంధించిన లేఖ అని, కేవలం వాటర్​ అవైలబిలిటీకి సంబంధించినదని తెలిపారు.  ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్‌‌‌‌ఎస్ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 

పోలవరం–నల్లమల్ల సాగర్‌‌‌‌‌‌‌‌ కేసులో సుప్రీంకోర్టులో మన వాదనలు బలంగా వినిపించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి సూచించినట్లు మంత్రి తెలిపారు. ‘‘ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రిట్ పిటిషన్ కాకుండా సూట్ పిటిషన్ రూపంలో రావాలని కోర్టు సూచించింది. వచ్చే సోమవారం జరిగే విచారణలో ఈ ప్రాజెక్టుపై ‘స్టే’ ఇవ్వాలని కోరుతాం. ఆ రోజు విచారణకు నేను స్వయంగా హాజరవుతా. ఈ లోపు మళ్లీ అడ్వకేట్లతో సమావేశమవుతా’’అని వివరించారు. 

మా ఒత్తిడితోనే  ‘సీమ ఎత్తిపోతల’ ఆగింది

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆగిపోయాయని మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. ‘‘మా ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి వల్లే ఏపీ ప్రభుత్వం పనులు నిలిపివేసింది. గతంలోనే పనులు ఆగిపోయి ఉంటే.. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌ఎస్ ఆ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు?’’ అని  ప్రశ్నించారు. బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, ప్లేస్‌‌‌‌లు మారుస్తూ భారీ నష్టం చేశారని ఉత్తమ్  అన్నారు.  

‘‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్‌‌‌‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు. ఇది చారిత్రాక తప్పిదం’’ అని మండిపడ్డారు.