విదేశాలకు రైస్ ఎక్స్పోర్ట్ అవకాశాలను గుర్తించండి : మంత్రి ఉత్తమ్

విదేశాలకు రైస్ ఎక్స్పోర్ట్ అవకాశాలను గుర్తించండి : మంత్రి ఉత్తమ్
  • అగ్రికల్చర్​ వర్సిటీ, సివిల్​ సప్లయ్స్​ అధికారులతో సమీక్షలో మంత్రి ఉత్తమ్
  • వానాకాలం ధాన్యం సేకరణకు 25,500 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర నుంచి బియ్యం ఎగుమతులకు విదేశీ మార్కెట్లలో అవకాశాలను గుర్తించాలని సివిల్ సప్లైస్  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సెక్రటేరియెట్ లో అగ్రికల్చర్​ వర్సిటీ, సివిల్​ సప్లయ్స్​ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయన  మాట్లాడుతూ గత వానాకాలం సీజన్​లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులు సేకరించిన నేపథ్యంలో ఈ నిల్వలను ఎక్స్​పోర్ట్​ చేసేందుకు  చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిల్వల సమస్యను పరిష్కరించేందుకు  విస్తృత ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ‘‘విదేశాలకు బియ్యం   ఎగుమతులకు సంబంధించి డ్రాఫ్ట్ పాలసీ తయారీ చేయాలి. ఎక్స్​పోర్ట్​ మార్కెట్లలో డిమాండ్  ఉన్న రైస్ వెరైటీలను ప్రోత్సాహించాలి. రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతి చేయాలనుకునే దేశాల ప్రతినిధులను ఆహ్వానించి రెండు రోజుల సదస్సు నిర్వహించాలి. అలాగే రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి యేటా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయించిన టార్గెట్​ను పెంచాలి.

గత సీజన్‌లో కేంద్రం టార్గెట్​ 50 లక్షల టన్నులు కాగా,రాష్ట్రం 72 లక్షల  టన్నులు సేకరించింది. ధాన్యం సేకరణ, బోనస్‌ల చెల్లింపులు కలిపి రూ.19,500 కోట్లు, నిల్వ, బ్యాంకు వడ్డీలకు రూ.6,000 కోట్లు కలిపి మొత్తం రూ.25,500 కోట్లు ఖర్చు చేశాం” అని మంత్రి తెలిపారు.  భారత్ 2025–-26లో రికార్డు స్థాయిలో 160 మిలియన్   టన్నుల బియ్యం ఉత్పత్తి చేస్తోందని, తెలంగాణ జాతీయ స్థాయిలో 10- నుంచి 11 శాతం ఉత్పత్తి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. 

ఎఫ్ సీఐ వద్ద 67 మిలియన్  టన్నులు

ఎఫ్‌సీఐ వద్ద 67 మిలియన్  టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్  తెలిపారు. భారత్  ఎగుమతి నిషేధం ఎత్తివేసిన తర్వాత  బియ్యం ధరలు గణనీయంగా పడిపోయాయన్నారు. ఫిలిప్పీన్స్ యేటా 4.5 మిలియన్  టన్నులు దిగుమతి చేసుకుంటోందని, ఆ దేశం వియత్నాంపై ఆధారపడడం తగ్గించి, తెలంగాణ బియ్యంపై ఆసక్తి చూపుతోందని తెలిపారు. ఇప్పటివరకూ తెలంగాణ బియ్యం మాత్రమే ఫిలిప్పీన్స్  మార్కెట్‌లోకి ఎగుమతి అయ్యిందన్నారు.

నైజీరియా యేటా 3 మిలియన్ టన్నుల లాంగ్- గ్రెయిన్  పార్‌బాయిల్డ్ రైస్  ఇంపోర్ట్​ చేసుకుంటోందని, ఇది మనకు మరో మార్కెట్ కాగలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్​ వర్సిటీకి నైజీరియాలో ఇన్‌స్టిట్యూషనల్  కాంటాక్టులు ఉన్నాయని, రైస్​ ఎక్స్​పోర్ట్స్​అవకాశాలను అన్వేషించాలని సూచించారు.