- పర్యావరణ, అటవీ అనుమతులను త్వరగా తీసుకోండి: ఉత్తమ్
- ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష
- ఈ నెల 15న సీతారామ పంప్‌హౌస్‌లను సీఎం ప్రారంభిస్తారని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సీతారామ ప్రాజెక్టులోని ప్యాకేజీ 1, 2 పనులకు సంబంధించి భూ సేకరణ చేపట్టాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. దీనికి 3 వేల ఎకరాలు అవసరమవుతాయని, భూ సేకరణ వెంటనే చేపడితే గడువులోగా లక్ష్యం చేరుకుంటామన్నారు. ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి అడ్డంగా ఉన్న రైల్వే క్రాసింగ్‌లపై ఆ శాఖతో చర్చించి అనుమతులు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి 34.561, 37.551 కిలోమీటర్ల వద్ద ఉన్న క్రాసింగ్‌లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు.
ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌ల ప్రారంభోత్సవం, అనుమతులపై శనివారం ఆయన సెక్రటేరియెట్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టుకు గోదావరి నుంచి 67 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లివ్వాలన్న లక్ష్యంతో పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ నిర్మాణ అనుమతులు చివరి దశకు చేరాయని, అనుమతుల అంశం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు చేరిందని చెప్పారు. సమీక్షలో ఆ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీ అనిల్ కుమార్, డిప్యూటీ ఈఎన్‌సీ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అటవీ అనుమతులపై దృష్టి పెట్టండి..
ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల అనుమతులపై దృష్టి సారించాలని, వీలైనంత త్వరగా అధికారులతో సంప్రదింపులు జరపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే, ఎన్జీటీతో పాటు సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలన్నారు. ఈ పనులను వేగంగా పూర్తి చేస్తే 3 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు కొత్తగా 2.60 లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించవచ్చని చెప్పారు. కాగా, ప్రాజెక్టులో మూడు పంప్ హౌస్‌లను ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. అందులో భాగంగా ఆదివారం వాటిని ట్రయల్ రన్ చేస్తున్నామని తెలిపారు.
