హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్ గ్రహీత ఎస్.జైపాల్ రెడ్డి ఒక ఆదర్శ రాజకీయ నాయకుడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి 84వ జయంతి సందర్భంగా శుక్రవారం (జనవరి16) పీవీఎన్ఆర్ మార్గ్‌లోని స్ఫూర్తిస్దల్ ( జైపాల్ రెడ్డి స్మారకం) దగ్గర పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే , ఎంపీ, కేంద్ర మంత్రిగా దేశానికి గొప్ప సేవ చేసిన మహా నాయకుడు జైపాల్ రెడ్డి అని కొనియాడారు. ఆయన లోక్ సభలో ఉన్నప్పుడు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చిందని తెలిపారు. మా ప్రాంతా అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడ్డ వ్యక్తి జైపాల్ రెడ్డి అని.. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమన్నారు.విలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని.. ఆయన స్మృతులు ఎప్పుడూ మా మధ్య ఉంటాయని పేర్కొన్నారు.
Also Read : కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌లు కట్టిర్రు
జైపాల్ రెడ్డి సెక్యులర్ లీడర్: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఒక సెక్యులర్ లీడర్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్‌గా క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు మాకు ఆజాద్ చెప్పేవారన్నారు. కుల, మత, ప్రాంత బేధం చూడకుండా ప్రజా సేవ చేసిన గొప్ప నాయకుడు జైపాల్ రెడ్డి అని కీర్తించారు.
