సీతారామ ప్రాజెక్టులో భారీ కుంభకోణం: మంత్రి ఉత్తమ్ కుమార్

సీతారామ ప్రాజెక్టులో భారీ కుంభకోణం: మంత్రి ఉత్తమ్ కుమార్

హైదరాబాద్‌:  సీతారామ ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జనవరి 19వ తేదీ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు భట్టీ విక్రమార్క, పొగులేటీ శ్రీనివాస్ రెడ్డి, పలువురు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. సీతారామ ప్రాజెక్టులో భారీ కుంభకోణానికి పాల్పడినట్లు చెప్పారు.  స్వతంత్ర భారతంలో ఇంత పెద్ద తప్పిదం ఎప్పుడూ జరగలేదన్నారు.  అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.  సీతారామ ప్రాజెక్ట్‌ ఖర్చు భారీగా పెంచారని తెలిపారు.
 2014 లో మరో 14వందల కోట్లు ఖర్చు చేస్తే అయిపోయే ప్రాజెక్టు పదేళ్లు అయినా పూర్తి కాలేదన్నారు. 7వేల ఐదు వందల కోట్ల రూపాయలు అదనంగా కర్చు చేశారని తెలిపారు.  3లక్షలకు పైగా ఆయకట్టుకు నీళ్ళు అప్పుడే వచ్చేదని...కానీ ఇప్పటికీ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని చెప్పారు. సీతారామ ప్రాజెక్టుకు మొత్తం 18వేల కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసమని.. కానీ, గత బీఆర్ఎస్ సర్కార్  ప్రాజెక్టులను పూర్తి చేయకుండా.. అక్కరకు రానీ కాళేశ్వరాన్ని కట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. సీతారామ ప్రాజెక్టుపేరు చెప్పి రూ.18 వేల కోట్లకు అంచనా వ్యయం పెంచారని.. కొత్త ఆయకట్టు కింద ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.  సీతమ్మ బ్యారేజీకి నీటిని అందించేందుకు రూ.3వేలకు కోట్లకు పైగా ప్రాజెక్టు ఖర్చు అంచనా వేశారని...  కానీ ఖర్చు చేసింది మాత్రం రూ.4వేల కోట్లే అని తెలిపారు . రీడిజైన్ పేరుతో ఒక్క ఎకరానికి నీరు అందివ్వలేదన్నారు. మొదటి మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు చేస్తే వేల ఎకరాలకు నీరు వచ్చేదని..కానీ కేసీఆర్ ప్రభుత్వం అలా చేయలదని మంత్రి భట్టి చెప్పారు.