- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, వెలుగు : పేద ప్రజల సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే తన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామస్వామి గుట్ట వద్ద పేదల కోసం నిర్మిస్తున్న 2,160 మోడల్ హౌసింగ్ కాలనీ పనులను పరిశీలించారు. ఈ కాలనీని జులై నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వేపాలసింగారంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించడంతో పాటు, ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
పట్టణంలో నూతన సీసీ కెమెరాలను, మఠంపల్లిలో రూ. 80 లక్షలతో నిర్మించిన పాక్స్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం, వైద్యం, విద్య, ఉపాధి, గృహ వసతి రంగాల్లో ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తూ, హుజూర్ నగర్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరుమల్లికార్జునరావు, నాయకులు ఉన్నారు.
