కులగణన న్యాయ సమీక్షకు నిలబడ్తుంది..50% కోటాను మించి రిజర్వేషన్లు సాధిస్తం: ఉత్తమ్

కులగణన న్యాయ సమీక్షకు నిలబడ్తుంది..50% కోటాను మించి రిజర్వేషన్లు సాధిస్తం: ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్వహించిన కులగణన న్యాయ సమీక్షకు నిలబడ్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 50% కోటాను మించి రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పారు. గురువారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌‌లో కులగణనపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమంలో ఉత్తమ్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కులగణన ప్రక్రియ ప్రారంభించి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఆయన తెలిపారు. ‘‘94 వేల మంది ఎన్యుమరేటర్లతో కులగణన సర్వే అత్యంత పకడ్బందీగా చేశాం. 

50 రోజుల పాటు రాష్ట్ర యంత్రాంగం మొత్తం కచ్చితమైన డేటా సేకరణపైనే దృష్టిపెట్టింది. గతంలో ఓబీసీలకు సంబంధించి సమగ్ర డేటా లేనందున ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ, మేం పూర్తి శాస్త్రీయంగా, సమగ్రంగా, ఎంపిరికల్ డేటా సేకరించాం. దీని ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించాం. ఆ బిల్లు లను గవర్నర్‌‌‌‌ కేంద్రానికి పంపించారు. కానీ, కేంద్రం వాటిని పెండింగ్‌‌లో పెట్టింది” అని వివరించారు. కులగణన స్టడీకి వేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.