
- ఈ సీజన్‌లో 66.8 లక్షల ఎకరాల్లో 148.03 లక్షల టన్నుల దిగుబడి
- రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
- వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సివిల్ సప్లయిస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 40 లక్షల టన్నుల సన్నాలు, 40 లక్షల టన్నుల దొడ్డు రకాలు కలిపి ఈసారి 80 లక్షల టన్నులు సేకరిస్తామని, ఇందుకోసం 8,342 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 4,259 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 3,517 ఐకేపీ సెంటర్లు, మరో 566 ఇతర సంస్థల ద్వారా కొనుగోళ్లు చేపడ్తున్నామని వెల్లడించారు.
వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై బుధవారం సెక్రటేరియెట్ నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. కొనుగోలు వివరాలను ట్యాబ్‌లో నమోదు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తామని, ఇందుకోసం రూ.22 వేల కోట్ల నుంచి రూ. 23 వేల కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. సన్నాలకు రూ.500 అదనంగా బోనస్ అందజేస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈసారి రికార్డు స్థాయిలో దిగుబడి
రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో 66.8 లక్షల ఎకరాల్లో 148.03 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చిందని, ఇది ఆల్‌టైమ్ రికార్డు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం వ్యవసాయంపై అనుసరిస్తున్న విధానాలే ఈ తరహా ఉత్పత్తికి కారణమన్నారు. కాగా, 80 లక్షల టన్నుల వడ్లు సెంటర్లకు వస్తాయనుకుంటున్నామని, ఈ మేరకు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లతో పాటు అన్ని సదుపాయాలు, రవాణా వసతులు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు వివరాలు ట్యాబ్‌లో నమోదైన 48 గంటలలోపు చెల్లింపులు జరగాలని సూచించారు. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో 1,205 కేంద్రాలు ప్రారంభమైనట్టు ఆయన వివరించారు.
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించండి: మంత్రి తుమ్మల
రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే సెంటర్ల నుంచి తరలించేందుకు లారీలను అందుబాటులో ఉంచాలన్నారు.
కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోతల సీజన్ మొదలైన నేపథ్యంలో బుధవారం వరి, మక్క, పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, హాకా, ఆర్‌ఐసీ సంస్థల ఎండీలు హాజరయ్యారు.