- కేసీఆర్.. రూ. లక్షన్నర కోట్లు పెట్టి ఏం సాధించినవ్?: మంత్రి ఉత్తమ్
- నీవు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది
- పాలమూరు - రంగారెడ్డికి 90 టీఎంసీల కేటాయింపులు కాంగ్రెస్ హయాంలోనే
- బీఆర్ఎస్ పాలనలోనే డీపీఆర్‌లు వెనక్కు వచ్చినయ్
- జగన్‌తో కుమ్మక్కై కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే కేసీఆర్
- ఆయన అవినీతి, కమీషన్ల కక్కుర్తితోనే ఇరిగేషన్ శాఖకు నష్టాలని ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పదేండ్ల పాటు అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయనే ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద చల్లడం సిగ్గుచేటన్నారు. ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలేనని కొట్టిపారేశారు. ఆదివారం సెక్రటేరియెట్‌లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా, కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నువ్వు కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేశావు. ఇప్పుడు మమ్మల్ని అంటవా?" అని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ హయాంలోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టును రూ.38,500 కోట్లతో రూపొందించాం. అప్పట్లోనే రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ కేసీఆర్ వచ్చాక అంబేద్కర్ పేరు తీసేసి, ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి రూ.1.50 లక్షల కోట్లకు పెంచిండు. అంత ఖర్చుపెట్టి ఏం సాధించినవ్? కట్టిన బ్యారేజీలు కుంగిపోయినయ్. మేడిగడ్డ పిల్లర్లు దెబ్బతిన్నయ్. ఎన్ డీఎస్ఏ, విజిలెన్స్ ఎంక్వైరీల్లో నీ పాపం బయటపడింది. ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నవ్’’ అని ఉత్తమ్ విమర్శించారు. దీనిపై చట్ట ప్రకారమే ముందుకు పోతున్నామన్నారు. రాజీవ్‌గాంధీ దుమ్ముగూడెం, ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్ట్ స్కీమ్‌లను రద్దు చేసి.. సీతారామ, సీతమ్మసాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టులను నిర్మించారని విమర్శించారు. ఆ పాత స్కీమ్‌లను రద్దు చేయకుండా ఉంటే.. రూ.1,550 కోట్లతో 4.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చేదన్నారు. ఇప్పుడు సీతారామసాగర్ ఖర్చు రూ.18 వేల కోట్లకు పెరిగిందన్నారు. సీతమ్మసాగర్ కూడా కలుపుకుంటే రూ.25 వేల కోట్ల దాకా ఉంటుందన్నారు. కేంద్రం నిధులు ఇచ్చే దేవాదుల ప్రాజెక్టును పదేండ్లపాటు పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ పెద్దరికాన్ని కాపాడుకోవాలని, నోరు జారితే తాము కూడా నోరు జారాల్సి వస్తుందని హెచ్చరించారు.
డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఏవీ?
పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఉత్తమ్ అన్నారు. ‘‘ప్రాజెక్టు పూర్తయితే పొలాలకు నీళ్లు ఎందుకు పారలే? పదేండ్లలో ఒక్క డిస్ట్రిబ్యూటరీ కెనాల్ అయినా తవ్వినవా? మెయిన్ ట్రంక్ లైన్ తప్ప పిల్ల కాలువలకు తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఆనాడు రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. నార్లాపూర్–-ఏదుల లింక్ కెనాల్ పనులను రివైజ్డ్ ఎస్టిమేట్స్ తో పూర్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో ఆ పనులు పూర్తి కాలేదు’’ అని అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించామన్నారు. ఇప్పుడేదో తాము 45 టీఎంసీలకే ఒప్పుకున్నామంటూ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్‌లో 45 టీఎంసీలు, గోదావరి డైవర్షన్లోని 45 టీఎంసీలను ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి ఎప్పటికప్పుడు లేఖలు రాశామన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ డీపీఆర్‌ను 2023 ఏప్రిల్19లోనే కేంద్రం రిటర్న్ పంపిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అప్పుడు సీఎంగా, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది కేసీఆరేనని, ఇరిగేషన్‌శాఖను సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. ముందు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన అవినీతి, కమీషన్ల కక్కుర్తి వల్లే ఇరిగేషన్ శాఖ నష్టాల్లో కూరుకుపోయిందన్నారు.
రూ.49,370 కోట్ల అసలు, మిత్తీలు కట్టాం
ఇరిగేషన్ శాఖను కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ గద్దె దిగిన 2023 నాటికి ఇరిగేషన్ శాఖకు రూ.88 వేల కోట్ల అప్పులు మిగిల్చిపోయారన్నారు. ఈ రెండేండ్లలో రూ.49,370 కోట్లు అసలు, మిత్తీ కట్టామన్నారు. ‘‘ప్రాజెక్టుల పేరుతో విచ్చలవిడిగా అప్పులు తెచ్చిండ్రు. అవి కట్టలేక ఇప్పుడు ఇరిగేషన్ బడ్జెట్ మొత్తం మిత్తీలకే పోతున్నది. రూ.16 వేల కోట్లు మిత్తీలుగా కడుతున్నాం. మేము వచ్చాక ఆ అప్పులను రీ-స్ట్రక్చర్ చేస్తున్నాం. గతంలో 11 శాతం ఉన్న వడ్డీని 7 నుంచి 8 శాతానికి తగ్గించుకుంటూ భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. పెండింగులో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టుల పనులను పూర్తి చేసే బాధ్యత మాదే’’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఒకటిన్నర రెండేండ్లలో వాటిని పూర్తి చేస్తామన్నారు. ఎవరిది దద్దమ్మ ప్రభుత్వమో ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. నెట్టెంపాడు ప్రాజెక్టులోని రేలంపాడు కెపాసిటీ పెంచడం వల్ల సీపేజీ ఏర్పడిందని, దానికి రిపేర్లు చేసి వాడుకలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
జగన్‌తో కుమ్మక్కై కృష్ణా నీళ్లు తాకట్టు..
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆరేనని ఉత్తమ్ ఆరోపించారు. ‘‘అప్పటి ఏపీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడుతుంటే.. ఆయనతో కుమ్మక్కై కళ్లు మూసుకుని కూర్చున్నవ్. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌ను వాయిదా వేయించి, ఏపీకి టెండర్లు పిలుచుకునే అవకాశం ఇచ్చింది నువ్వు కాదా? పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే పదేండ్లు ఏం చేసినవ్? పైగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలు, ఏపీ వాటా 512 టీఎంసీలు అని నువ్వే అపెక్స్ కౌన్సిల్ లో రాతపూర్వకంగా ఒప్పుకున్నవ్. ఇది తెలంగాణ రైతుల గొంతు కోయడం కాదా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ లిఫ్ట్ పనులను అడ్డుకున్నామని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా సమర్థంగా ట్రిబ్యునల్‌లో కొట్లాడుతున్నామన్నారు. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం 500 టీఎంసీలకన్నా ఎక్కువగా తెలంగాణకు ఇవ్వాలని పోరాడుతున్నామని చెప్పారు. తెలంగాణలో దేశంలోనే అత్యధికంగా రికార్డ్ స్థాయిలో వరి ధాన్యం పండింది కాంగ్రెస్ హయాంలోనేనని స్పష్టం చేశారు. అలాగే పాలమూరు, నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పండిందన్నారు. పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్ట్‌పై కేంద్రం వద్ద, సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన జలాలపై కమిట్మెంట్తో కొట్లాడుతున్నామని చెప్పారు.
