హైదరాబాద్, వెలుగు: ఎస్సారెస్పీలో పూడికతీత పనులపై వచ్చే కేబినెట్లో చర్చిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల్లో పూడిక సమస్య దేశవ్యాప్తంగా ఉందన్న ఆయన..హిమాచల్ లోని భాక్రానంగల్నుంచి మన ఎస్సారెస్పీ వరకు అన్నింట్లోనూ ఇదే సమస్య ఉందన్నారు. పూడిక వల్ల ఎస్సారెస్పీ సామర్థ్యం 120 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పడిపోయిందన్నారు.
శుక్రవారం ఆయన సెక్రటేరియెట్‌లో అధికారులు, ఎస్సారెస్పీ స్టేజ్ 2 ఆయకట్టు రైతు ప్రతినిధులతో సమీక్ష చేశారు.రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో పూడికతీత సెకండ్ఫేజ్పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల్లో కోల్పోయిన నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించి రైతులకు నీళ్లివ్వాలన్నారు. చివరి ఆయకట్టు రైతులకూ నీళ్లందించేలా చర్యలు చేపడతామని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని రైతులకు హామీ ఇచ్చారు.
ఇప్పటికే తొలిదశలో కడెం ప్రాజెక్టులో విజయవంతంగా పూడికతీత పనులు చేస్తున్నామన్నారు. అయితే, పూడికతీతలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బయటకు తీసిన ఇసుక తరలింపు కష్టంగా మారిందన్నారు. స్థానికంగా డిమాండ్ లేకపోవడం, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు తరలింపులో ఇబ్బందులు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. సమీక్షలో ఇరిగేషన్‌శాఖ సెక్రటరీ శ్రీధర్, స్పెషల్సెక్రటరీ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఈఎన్సీ జనరల్రమేశ్ బాబు, జాయింట్‌సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
