
- ప్రధాన బ్యారేజీ నిర్మాణంలో ఇంత నాసిరకం పనులా?
- బ్యారేజీ కుంగడానికి కారణమైన వారిని వదలబోమని హెచ్చరిక
- ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులతో సెక్రటేరియెట్లో భేటీ
- అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టిన ఏజెన్సీలతోనూ సమావేశం ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు ఆదేశం
- ప్రాజెక్టుల కోసం గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన
- ఖర్చుల వివరాలు ఇవ్వాలని ఆర్డర్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీని ఎల్ అండ్ టీ సంస్థనే పునరుద్ధరించాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సోమవారం సెక్రటేరియెట్లో ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్.వి.దేశాయ్ సహా ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజీ అయిన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నాసిరకంగా పనులు చేశారని, నాణ్యత లేకుండా ఎట్లా పనులు చేస్తారని ఆయన నిలదీశారు. రిపేర్లతో సంబంధం లేదని ఏదో ఒక లెటర్ రాసి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృథా చేసి బ్యారేజీ కుంగిపోవడానికి కారణమైన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
బ్యారేజీ మొత్తం పరిస్థితిపై సమగ్ర నివేదిక అందిన తర్వాతే పునరుద్ధరణ పనులు చేపట్టాలని, ఆ మొత్తం బాధ్యత వర్క్ ఏజెన్సీదేనని మంత్రి ఉత్తమ్ తేల్చి చెప్పారు. ఈ విషయం లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. బ్యారేజీ పై పూర్తి స్థాయిలో స్టడీ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించిన ఏజెన్సీలతోనూ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయ, చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లోని పలు అంశాలతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులకు చేసిన ఖర్చు, కొత్తగా ఏర్పడిన ఆయకట్టు సహా అన్ని వివరాలు మంగళవారంలోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో ఇరిగేషన్ పై ప్రజంటేషన్ ఇచ్చేందుకు అవసరమైన సమగ్ర వివరాలు ఇవ్వాలని సూచించారు.