గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలే: మంత్రి వాకిటి శ్రీహరి

గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలే: మంత్రి వాకిటి శ్రీహరి
  • చెరువుల్లో ఎన్ని చేపలు వేశారో కూడా లెక్కల్లేవ్

వికారాబాద్, వెలుగు: మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెను మార్పులు తీసుకువస్తున్నదని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం వికారాబాద్​జిల్లాలోని కోట్ పల్లి ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మూడు రకాలతో కూడిన 10 లక్షలపైగా చేప పిల్లలను ప్రాజెక్టులో వదిలారు. గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని, చెరువుల్లో ఎన్ని చేపలను వదిలారో కూడా లెక్కలు లేవన్నారు. 

రాష్ట్రంలోని 5 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కలిగేలా రూ.123 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. మత్స్యకారులు ఏదైనా ప్రమాదాలకు గురైతే ఉచిత బీమాకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మత్స్యకారుల సంఘాల్లో సభ్యత్వ సమస్య ప్రధానంగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. 

అనంతరం తాండూర్​లో ముదిరాజ్​ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో మత్య్స, ముదిరాజ్, ఆర్య వైశ్య, స్పోర్ట్స్​కార్పొషన్​ల చైర్మన్​లు సాయి కుమార్, బి.జ్ఞానేశ్వర్, కల్వ సుజాత, శివా రెడ్డి,  జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ 
తదితరులు పాల్గొన్నారు.