ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణ‌‌‌‌లో నిర్వహించండి :మంత్రి వాకిటి శ్రీహరి

ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణ‌‌‌‌లో నిర్వహించండి :మంత్రి వాకిటి శ్రీహరి
  • రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి నిధులు ఇవ్వండి: మంత్రి వాకిటి
  • ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌‌‌‌సుఖ్ మాండవీయాతో భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌‌‌‌ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌‌‌‌కు శుక్రవారం ఢిల్లీలోని నివాసంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌‌‌‌సుఖ్ మాండవీయాతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు. ఈ సంద‌‌‌‌ర్భంగా తెలంగాణ‌‌‌‌లో క్రీడా అభివృద్ధికి సంబంధించిన అంశాల‌‌‌‌పై చ‌‌‌‌ర్చించి, ప‌‌‌‌లు విజ్ఞప్తులు చేశారు.

 అనంతరం మంత్రి శ్రీ‌‌‌‌హ‌‌‌‌రి మీడియాతో మాట్లాడుతూ.. ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌‌‌‌ను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశామ‌‌‌‌ని చెప్పారు. ఇదివరకే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసిన విష‌‌‌‌యాన్ని గుర్తుచేశారు. వచ్చే ఏడాది జ‌‌‌‌రిగే ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహ‌‌‌‌ణ‌‌‌‌కు తెలంగాణ అన్ని విధాలుగా అనువైన ప్రదేశ‌‌‌‌మ‌‌‌‌ని మ‌‌‌‌రోసారి వివ‌‌‌‌రించామ‌‌‌‌న్నారు. 

అలాగే.. రాష్ట్రంలోని హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్, వనపర్తి సహా వివిధ జిల్లాల్లో ఉన్న క్రీడా స్కూళ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరామ‌‌‌‌న్నారు. క్రీడలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాముఖ్యతనిస్తూ రాష్ట్ర క్రీడా పాలసీని స్వయంగా తయారు చేయించారని తెలిపారు. స్టేడియాలు నిర్మించాలని పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌‌‌‌ని, అందుకు అనుగుణంగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రికి వివరించామ‌‌‌‌న్నారు. అన్ని విషయాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలో ఆయన తెలంగాణలో మూడ్రోజులు పర్యటించనున్నట్లు వెల్లడించారు. 

క్రీడా రంగం పెండింగ్ పనులపై చర్చించాం: శివసేనా రెడ్డి

రాష్ట్రంలోని క్రీడా రంగానికి సంబంధించిన వివిధ పెండింగ్ పనుల గురించి కేంద్ర మంత్రితో చర్చించామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. వనపర్తిలోని హాకీ అకాడమీలో మౌలిక సదుపాయాల కల్పన, స్పోర్ట్స్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌లో టర్ఫ్ ఏర్పాటు, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌‌‌‌నగర్, జడ్చర్ల.. వంటి ప్రాంతాల్లోని స్పోర్ట్స్ స్కూల్స్‌‌‌‌లో ఎక్విప్‌‌‌‌మెంట్ కోసం ఫండ్స్ కావాలని కోరినట్లు చెప్పారు.

 తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామ‌‌‌‌ని, ఈ వర్సిటీకి సహకరించాలని కోరామ‌‌‌‌న్నారు. ఈ సమావేశంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.