హైదరాబాద్ – విజయవాడ హైవేపై సర్వీస్ రోడ్ ను కేంద్రం నిర్మించాలి.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరిన మంత్రి వెంకటరెడ్డి

హైదరాబాద్ – విజయవాడ హైవేపై సర్వీస్ రోడ్  ను కేంద్రం నిర్మించాలి.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరిన మంత్రి వెంకటరెడ్డి
  • ట్రిపుల్ఆర్​ను ఆమోదించండి
  • సౌత్ పార్ట్​ను కేంద్రమే నిర్మించాలి: మంత్రి వెంకట్ రెడ్డి
  • విజయవాడ హైవేపై సర్వీస్ రోడ్ నిర్మించాలి
  • ఎల్బీనగర్ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ మంజూరు చేయండి
  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతి

హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ దాకా నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నార్త్ పార్ట్ భూసేకరణ కంప్లీట్ అయిందని, కేంద్ర కేబినెట్ లో ఈ ప్రాజెక్టును ఆమోదించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కోరారు. అదేవిధంగా, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా నిర్మించనున్న సౌత్ పార్ట్ ను కేంద్రమే నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

 రాష్ట్ర ఎంపీలు రఘురాం రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, సురేశ్ షెట్కార్, చామల కిరణ్, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నితిన్ గడ్కరీని ఆయన ఆఫీస్​లో కలిశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులపై చర్చించారు. 

హైదరాబాద్ – విజయవాడ, మల్కాపూర్ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలుగా విస్తరించడంతో పాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలని గడ్కరీని వెంకట్ రెడ్డి కోరారు. డెత్ రోడ్డుగా పిలిచే హైదరాబాద్ – విజయవాడ హైవే (ఎన్ హెచ్ 65)పై జులై 27న జరిగిన ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు చనిపోయారని వివరించారు. 

స్పందించిన గడ్కరీ.. ఆగస్టు 15న నిర్వహించే ఫైనాన్స్ మీటింగ్​లో ఎన్​హెచ్ 65 విస్తరణను ఆమోదిస్తామని తెలిపారు. అంచనాలు రూపొందించి పంపాలని, వెంటనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఎల్బీ నగర్ చింతల్ కుంట చెక్ పోస్ట్ నుంచి హయత్ నగర్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు దాదాపు ఐదున్నర కిలో మీటర్ల ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా నిర్మించడంతో పాటు నాగ్ పూర్ లో మాదిరిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా నిర్మాణం చేపట్టాలని గడ్కరీని మంత్రి కోరారు. 

హైదరాబాద్ – శ్రీశైలం రహదారిలో టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తున్న ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా గుర్తించాలన్న కోమటిరెడ్డి విజ్ఞప్తికి.. అలైన్ మెంట్ అప్రూవల్ ఇస్తూ మంజూరు చేస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు.

నేను మంత్రి పదవులు ఇచ్చే స్థాయిలో లేను: మంత్రి వెంకట్ రెడ్డి

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో నో కామెంట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాను మంత్రి పదవులు ఇచ్చే స్థాయిలో లేనని తెలిపారు. తన పరిధిలోని లేని అంశాలపై చర్చించి లాభం లేదని తెలిపారు. 

గడ్కరీతో భేటీ అయ్యాక తెలంగాణ భవన్​లో వెంకట్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం సూచన మేరకు మంత్రి పదవులపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటది. ఇందులో నా ప్రమేయం ఉండదు. రాజగోపాల్​రెడ్డికి మంత్రి పదవి ఇస్తే సంతోషమే. 

ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి కేసీఆర్ భూమి ఇవ్వలేదు. నేను అప్పటి ఏపీ సీఎం జగన్​తో మాట్లాడాను. వెంటనే ఆయన స్పందించారు. 40:60 రేషియోలో అడిగిన ప్రాంతాన్ని ఇచ్చారు. డీపీఆర్ సిద్ధంగా ఉన్నది. కేంద్రం అనుమతులు తీసుకుంటాం. 2 నెలల్లో టెండర్లు పిలిచి పటౌడీ హౌస్​లో తెలంగాణ భవన్ నిర్మిస్తాం’’అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 

బీఆర్ఎస్​ను తాము లెక్కలోకి తీసుకోవడం లేదని తెలిపారు. అలాంటప్పుడు ఆ పార్టీని చూసి తామెందుకు భయపడ్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నా.. ఎవరైనా ఆపాలని చెప్పినా.. గడ్కరీ వినే వ్యక్తి కాదని తెలిపారు.