త్వరలోనే హమాలీ కార్మికులకు ప్రత్యేక బోర్డు.. రూ.5 లక్షల ప్రమాద బీమా: మంత్రి వివేక్

త్వరలోనే హమాలీ కార్మికులకు ప్రత్యేక బోర్డు.. రూ.5 లక్షల ప్రమాద బీమా: మంత్రి వివేక్

హమాలీల చిరకాల కోరిక అయిన ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై మంత్రి వివేక్ వెంకటస్వామి  సానుకూలంగా స్పందించారు. హమాలీలకు సెపరేట్ బోర్డు ఏర్పాటు కోసం తక్షణమే ఒక కమిటీని నియమించబోతున్నామని.. అన్ని కోణాల్లో ఆలోచించి, నిపుణులతో చర్చించి, పకడ్బందీగా బోర్డు ఏర్పాటు చేయడానికి కొంచెం సమయం పడుతుందన్నారు.  కానీ ఖచ్చితంగా బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

కార్మికులు, హమాలీల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సమాజ నిర్మాణంలో, ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్లలో హమాలీలది అత్యంత కీలకమైన పాత్ర అని.. రక్తాన్ని చెమటగా మార్చి వారు కష్టపడి పనిచేస్తారని మంత్రి కొనియాడారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని.. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక గిగ్ వర్కర్ల రక్షణ కోసం ప్రత్యేకంగా 'గిగ్ వర్కర్స్ యాక్ట్' తీసుకొచ్చామని ఆయన గుర్తుచేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మినిమం వేజెస్ యాక్ట్‌ (కనీస వేతనాల చట్టం)ను సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు.

హమాలీల కుటుంబాలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అతి త్వరలోనే ఇందిరా జీవన్ బీమా కింద 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను అందించబోతోందని.. హమాలీలందరూ ఈ బీమా సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే అర్హులైన హమాలీలందరూ ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని.. కలెక్టర్లతో మాట్లాడి హమాలీల కోసం ఒకే చోట ప్రత్యేక కాలనీ కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అర్హులకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని.. కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.